వారంలో మొదటి రోజును భారీ నష్టాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి.. 40,145 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 11,767 వద్ద సెషన్‌ను ముగించింది.
అమెరికా ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం భారీగా కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయంగానూ పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రిస్క్ ఉన్న పొజిషన్లను వదిలించుకునేందుకు ట్రేడర్లు మొగ్గు చూపడం మార్కెట్లకు భారీ నష్టాలు మిగిల్చినట్లు అభిప్రాయపడుతున్నారు.
రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టే విధించిన నేపథ్యంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం భారీగా కుదేలయ్యాయి. ఈ పరిణామం కూడా స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,724 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,948 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,943 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,712 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎల్&టీ, షేర్లు లాభాలను గడించాయి.
బజాజ్ ఆటో, ఎం&ఎం, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ సూచీలు నష్టాలతో ముగిశాయి. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ సెలవులో ఉంది.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి 23 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 73.84 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 3.14 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 42.46 డాలర్లుగా ఉంది.