స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా టాప్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 261 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 48,438 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 14,199 వద్ద స్థిరపడింది. మిడ్ సెషన్ ముందు సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. చివరకు రికార్డు స్థాయిల వద్ద ముగియటం విశేషం. మార్కెట్లు లాభాలను నమోదు చేయడం వరుసగా ఇది పదో సెషన్.
కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సన్నాహాలు జరుగతున్న తరుణంలో మదుపరుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో నమోదైన కొనుగోళ్ల మద్దతు లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,486 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 47,903 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,215 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 14,048 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభాపడ్డాయి.
ఓఎన్జీసీ, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం&ఎం, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు మంగళవారం లాభపడ్డాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.
ఇదీ చూడండి:అదిరే ఫీచర్లతో షావోమి ఎమ్ఐ11 ప్రొ!