భారీ ఒడుదొడుకుల నడుమ.. స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 163 పాయింట్లు బలపడి.. 40,707 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 41 పాయింట్ల వృద్ధితో11,938 వద్దకు చేరింది.
అధ్యక్ష ఎన్నికలకు ముందే మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చన్న వార్తలతో అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలను గడించాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభంలో భారీగా పుంజుకున్నాయి. అయితే మిడ్ సెషన్ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగటం వల్ల.. ఓ దశలో భారీ నష్టాలను కూడా చవి చూశాయి సూచీలు. చివరకు విద్యుత్, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో లాభాలతో సెషన్‌ను ముగించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,976 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,150 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,019 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,776 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టీసీఎస్, రిలయన్స్, నెస్లే, హెచ్‌సీఎల్‌టెక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి.
రూపాయి, ముడి చమురు..
కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 9 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 73.58 వద్ద స్థిరపడింది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 1.44 శాతం పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 42.54 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:గృహ రుణాలపై స్టేట్ బ్యాంక్ వడ్డీ రాయితీ