ఏజీఆర్ బకాయిల సమస్యతో సతమతమవుతున్న టెలికాం రంగానికి అత్యవసర సహాయం అందించడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు దిల్లీలో సమావేశమయ్యారు. టెలికాం శాఖ సీనియర్ అధికారులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.
దాదాపు గంట పాటు జరిగిన ఈ భేటీలో టెలికాం రంగం కోలుకునేందుకు తీసుకునే చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రంగానికి ఊతం ఇచ్చేందుకు పలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
నీతి ఆయోగ్ సహా, ఆర్థిక శాఖ అధికారులు సైతం పాల్గొన్న ఈ భేటీలో చర్చించిన అంశాలపై అధికారులు ఎలాంటి విషయాలు తెలియజేయకపోవడం గమనార్హం. టెలికాం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్ సైతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.
ఏజీఆర్ బకాయిల నేపథ్యంలో
టెలికాం సంస్థలు ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్ల బకాయి పడ్డ నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని టెలికాం సంస్థలను ఇదివరకే ఆదేశించింది సుప్రీం. ఈ నేపథ్యంలో సుప్రీం ఉత్తర్వులతో సమతుల్యం పాటిస్తూ టెలికాం రంగం బాగోగులు చూసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే సుప్రీం నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు త్రీ-ప్లస్-వన్(మూడు ప్రైవేట్ రంగ సంస్థలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ) విధానం ప్రకారం ఈ రంగంలో పోటీని కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎయిర్టెల్ సేఫ్!
మొత్తం రూ.1.47 లక్షల కోట్ల బకాయిల్లో రూ.92,642 కోట్లు లైసెన్సు ఫీజులు, రూ.55,054 కోట్లను స్పెక్ట్రమ్ ఛార్జీల బకాయిలు ఉన్నాయి.
గత కొద్ది నెలల్లో పలు మార్గాల్లో 3 బిలియన్ డాలర్లను సేకరించిన ఎయిర్టెల్.. ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.53 వేల కోట్ల బకాయిల్లో ఏడు శాతం మాత్రమే చెల్లించిన వొడాఫోన్-ఐడియా... పీకల్లోతు కష్టాల్లోకి దిగజారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: వేసవికి ముందు వేడి కబురు- ఏసీ ధరలకు రెక్కలు!