SEBI IPO New Rules: వరుస ఐపీఓలతో స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ మీద ఉన్న వేళ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రేడింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ఇన్ వ్యవధిని పెంచింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు పద్ధతిలో మార్పులు చేసింది. వీటితో పాటు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు (ఏఐఎఫ్‌లు), మ్యూచువల్ ఫండ్‌లు, సెటిల్‌మెంట్ ప్రొసీడింగ్‌లు నిబంధనలను సవరించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది సెబీ.
సెబీ తీసుకున్న కీలక నిర్ణయాలు
- కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలో 20 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న మదుపరులు తమ హోల్డింగ్ నుంచి పూర్తిగా వైదొలగడాన్ని సెబీ నిషేధించింది. అయితే మొత్తం షేర్లలో 50 శాతం విక్రయించడానికి అనుమతించింది. కొత్తగా లిస్టింగ్ వచ్చిన కంపెనీల నష్టాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
- ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా సేకరించిన నిధులను సంస్థ ఎక్కువ భాగం అనుత్పాదక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు సెబీ గుర్తించింది. అందుకే ఐపీఓ ద్వారా సమీకరణ లక్ష్యాలను కఠినతరం చేసింది. ఇకపై కంపెనీలు అటువంటి కార్యక్రమాల కోసం ఐపీఓ ఆదాయంలో 25శాతం మాత్రమే ఉపయోగించేలా నిబంధనలు సవరించింది. ఐపీఓ సమయంలో సేకరించిన నిధుల వినియోగాన్ని రేటింగ్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి.
- రిటైల్ పెట్టుబడిదారుల నష్టాలను నివారించేందుకు మరో కీలక సవరణ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ఇన్ వ్యవధి ముగిసిన వెంటనే నిష్క్రమిస్తున్నారు. ఫలితంగా రిటైల్ మదుపర్లు నష్టపోతున్నారు. ఆ నష్టాలను నివారించేందుకు యాంకర్ లాక్ ఇన్ వ్యవధిని 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది.
- లిస్టెడ్ సంస్థలు సెబీ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇకపై ఓ కంపెనీ ఏదైనా సంస్థకు 5శాతం కంటే ఎక్కువ షేర్లను కేటాయించినట్లయితే.. వాల్యుయేషన్ రిపోర్ట్‌ను అందించాలి.
- ప్రైస్ బ్యాండ్ నిబంధనలను కూడా సెబీ సవరించింది. ఇకపై ఫ్లోర్ ప్రైస్, అప్పర్ ప్రైస్ మధ్య వ్యత్యాసం కనీసం 105 శాతం ఉండాలి.
- సెబీ నిబంధనల ప్రకారం.. కంపెనీలు సెటిల్‌మెంట్ దరఖాస్తులను ఫైల్ చేయడానికి కాల వ్యవధి షో-కాజ్ నోటీసు లేదా సప్లిమెంటరీ నోటీసు(ఈ రెండింటిలో ఏది తర్వాత అయితే అది) అందిన తేదీ నుంచి 60 రోజులు ఉంటుంది. అంతర్గత కమిటీ తర్వాత సవరించిన సెటిల్‌మెంట్ నిబంధనల ఫారమ్‌ను సమర్పించడానికి సమయం 15 రోజుల వ్యవధి(ఇది కమిటీ సమావేశం తేదీ నుంచి) ఉంటుంది.
ఇదీ చూడండి: చితికిపోతున్న చిన్న పరిశ్రమలు.. చర్యలు తక్షణావసరం