టెలికాం సంస్థల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో కీలక తీర్పు వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల గడువు ఇచ్చింది. 2031 నాటికి మొత్తం బకాయిల చెల్లింపులు పూర్తి చేయాలని టెల్కోలను ఆదేశించింది.
అయితే టెల్కోలు తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం 2021 మార్చి 31లోపు జమ చేయాలని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. ప్రతి ఏటా వడ్డీ చెల్లింపుల వివరాలు అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న బ్యాంకు గ్యారెంటీలు యథాతథంగా కొనసాగుతాయని న్యాయస్థానం పేర్కొంది.
కోర్టు ధిక్కరణలను తొలిగిస్తూ టెలికాం సంస్థలకు సుప్రీం ఊరటనిచ్చింది. అన్ని సంస్థల ఎండీలు నిబంధనలు అంగీకరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
దివాల ప్రక్రియలో ఉన్న టెల్కోలకు స్పెక్ట్రమ్ విక్రయించాలా? వద్దా? అనే విషయాన్ని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:కరోనా దెబ్బకు జీడీపీ 23.9% క్షీణత