దేశీయ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్కు అప్పగించే ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ విషయంపై ఆరు వారాల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.
మాల్యాపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా అప్పగింతపై లండన్ హై కమిషన్ నుంచి సమాచారం లేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది అత్యన్నత న్యాయస్థానం.
బ్రిటన్లో 'రహస్య' న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మాల్యాను భారత్కు అప్పగించే అవకాశం లేదని అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించడం గమనార్హం.
ఇదీ చూడండి:'మాల్యాను రప్పించేందుకు రహస్య ఆపరేషన్'