మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. రుణాల మారటోరియంకు సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర వివరాలు సమర్పించేందుకు మరికొంత గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు.
కొవిడ్ నేపథ్యంలో రుణాలపై మారటోరియం గడువు సహా వడ్డీ మాఫీని మరికొంత కాలం పొడిగించాలని దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వివరాలు సమర్పించాలని గతంలోనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని, కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సమగ్ర వివరాలు అందించేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 5కి వాయిదా వేసింది.