అతి పెద్ద దేశీయ బ్యాంక్ ఎస్‌బీఐ.. వినియోగాదారులకు అందించే ఏటీఎం, చెక్‌బుక్ సర్వీసుల ఛార్జీలను సవరించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడి) ఖాతాదారులు నెలలలో నాలుగు సార్లకు మించి ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలకు ఈ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఏడాదిలో చెక్ బుక్‌లో 10 లీవ్స్ వరకు మాత్రమే ఉచితంగా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఆపై జారీ చేసే లీవ్స్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.
ఈ సవరించిన రుసుములు 2021 జులై 1 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
మారిన ఛార్జీలు ఇవే..
ఒక నెలలో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అంతకు మించి చేసే నగదు ఉపసంహరణలపై రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ బ్రాంచ్/ ఏటీఎం వద్ద పరిమితికి మించి చేసే ఒక్కో కొత్త నగదు విత్‌డ్రా లావాదేవీకి రూ.15+జీఎస్‌టీ వసూలు చేస్తారు. ఈ విత్‌డ్రాలు హోం బ్రాంచ్, నాన్ ఎస్‌బీఐ ఎటీఎం వద్ద చేసినా ఛార్జీలు వర్తిస్తాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌బీడి ఖాతాదారులకు 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా ఇస్తుంది. ఆ తరువాత అందించే చెక్కులకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది.
- 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కు రూ.40+జీఎస్‌టీ
- 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కు రూ.75+జీఎస్‌టీ
- అత్యవసర చెక్ బుక్.. 10 లీవ్స్ లేదా అందులో కొంత భాగం ఉన్న చెక్‌బుక్‌కు రూ.50+జీఎస్‌టీ
- కొత్త చెక్‌బుక్ సర్వీస్ ఛార్జీల నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపు
వాటికి ఛార్జీలు లేవు..
ఎస్‌బీఐ, ఎస్‌బీఐయేతర బ్యాంక్ శాఖలలో బీఎస్‌బీడి ఖాతాదారులకు సంబంధించిన ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి రుసుములు వర్తించవు. ఈ ఖాతాదారులకు బ్రాంచ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే ట్రాన్స్‌ఫర్ లావాదేవీలు కూడా ఉచితం.
ఇదీ చదవండి:రూ.74 లక్షల కోట్లు దాటిన ఫేస్బుక్ మార్కెట్ విలువ!