స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 'ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడున్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగిరానుంది. ఈ కొత్త రేటు 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈబీఆర్ తగ్గింపుతో.. గృహ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ) రుణగ్రహీతలకు లాభం చేకూరనుంది.
మరింత సౌలభ్యం
ఎస్బీఐ 2019 జులై 1 నుంచి ఈ ఫ్లోటింగ్ రేటు గృహరుణాలు మంజూరుచేస్తోంది. ఈబీఆర్ తగ్గింపుతో ఇప్పుడున్న 8.15 శాతం వడ్డీరేటు.. నూతన సంవత్సరంలో 7.90 శాతానికి దిగిరానుంది.
ఆర్బీఐ ఆదేశాలతో..
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులను... ఒక నిర్దిష్ట వర్గాల రుణాలను ఈబీఆర్కు అనుసంధానించాలని ఆదేశించింది. 'రెపోరేటు' తగ్గింపుపై బ్యాంకులు తాత్సారం చేయడమే ఇందుకు కారణం. ఆర్బీఐ ఆదేశాల తరువాత ఎస్బీఐ తన ఈబీఆర్గా 'రెపోరేటు'ను స్వీకరించింది. 2019 అక్టోబర్ 1 నుంచి దీనిని ఆధారంగా చేసుకునే గృహ, ఎమ్ఎస్ఎమ్ఈ, రిటైల్ రుణాలు అందిస్తోంది.
ప్రయోజనాలు బదిలీ కావడం లేదు
ఆర్బీఐ ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. బ్యాంకులకు తమ ఈబీఆర్ను మూడు నెలలకోసారి మార్చుకునేందుకు అవకాశమూ ఉంది. అయినప్పటికీ బ్యాంకులు ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాలపై వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేటు (డబ్ల్యూఏఎల్ఆర్) 44 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గడం గమనార్హం.
ఇదీ చూడండి: 2020లో ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం: సీఐఐ