ఒకేసారి మదుపు చేసిన ఖాతాదారులకు నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన పథకమే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్. ఇందులో 36, 60, 84, 120 నెలల కాలానికి డిపాజిట్లను స్వీకరిస్తారు. తక్కువ కాలానికి డిపాజిట్ చేసిన వారికి నెలనెలా ఎక్కువ మొత్తం, ఎక్కువ కాలానికి చేసిన వారికి తక్కువ మొత్తం అందుతుంది.
యాన్యుటీ పథకంలో జమ చేసిన ఖాతాదారులకు నెలవారీ సమాన వాయిదా (ఈఎంఐ)ను ముందుగానే నిర్ణయించి, ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇందులో వడ్డీతోపాటు కొంత అసలూ ఉంటుంది. ఖాతాదారుడు చేసిన డిపాజిట్ మీద వచ్చే వడ్డీ, కొంత అసలునూ కలిపి బ్యాంకు వెనక్కి చెల్లిస్తుందన్నమాట. దీనివల్ల గడువు తీరే తేదీ నాటికి డిపాజిట్ మొత్తం ఏమీ మిగలదు.
- యాన్యుటీ డిపాజిట్ పథకంలో డిపాజిట్ మొత్తం రూ.15లక్షల కన్నా తక్కువ జమ చేస్తే.. వ్యవధికన్నా ముందుగా తీసుకునే అవకాశం ఉంది.
- రూ.15 లక్షలకు మించి డిపాజిట్ ఉన్నప్పుడు వ్యవధి తీరేంతవరకూ వెనక్కి ఇవ్వరు. అయితే, ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మిగిలిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. అత్యవసరం అనుకుంటే.. యాన్యుటీ మొత్తంలో 75శాతం వరకూ అప్పు పొందే అవకాశం ఉంది. అప్పు తీసుకున్న తర్వాత ప్రతినెలా చెల్లించే యాన్యుటీ మొత్తాన్ని ఆ అప్పు ఖాతాలో జమ చేస్తారు.
- ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 5 ఏళ్లకు వడ్డీ 6.20శాతం చొప్పున ఇస్తున్నారు. అంటే.. రూ.5 లక్షలు జమ చేస్తే..60 నెలలపాటు ప్రతి నెలా రూ.9,705 పొందవచ్చు. ఐదేళ్ల తర్వాత డిపాజిట్ రూ.5 లక్షలు కాస్తా సున్నా అవుతుంది.
రూ.5 లక్షల మొత్తం డిపాజిట్ చేసిన వారికి నెలనెలా వచ్చే మొత్తం..
- వడ్డీ 5.30శాతం ప్రకారం 36 నెలలపాటు రూ.15,048
- వడ్డీ 5.40శాతం ప్రకారం 60 నెలలపాటు రూ.9,552
- వడ్డీ 5.40శాతం ప్రకారం 120 నెలలపాటు రూ.5,396.
సీనియర్ సిటిజన్లకు...
- వడ్డీ 5.80శాతం ప్రకారం 36 నెలలపాటు రూ.15,159
- వడ్డీ 6.20శాతం ప్రకారం 120 నెలలపాటు రూ.5,594
- ఐదేళ్లకు మించి జమ చేసిన సీనియర్ సిటిజెన్లకు ఎస్‌బీఐ వGయ్ కేర్ పథకం కింద వచ్చే 0.30శాతం అదనపు వడ్డీ ఇందులో కలుస్తుంది. ఇది మార్చి 31 లోపు చేసిన డిపాజిట్లపైనే ఇది వర్తిస్తుంది.
ఇదీ చదవండి: 'పెట్రో ధరలపై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాలి'