సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరాంకో తొలిసారి ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సౌదీ తాదావుల్ స్టాక్ ఎక్సేంజ్‌లో మొదటి రోజే సంస్థ షేర్లు 10శాతం వృద్ధి సాధించాయి. ఆరాంకో మార్కెట్ విలువ 1.88 ట్రిలియన్ డాలర్లకు చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
1.5శాతం వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన ఆరాంకో.. ఒక్కో షేరు 32 సౌదీ రియాల్స్(8.53డాలర్లు)కు అమ్మింది. ఉదయం 10:30 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత ఒక్కో షేరు విలువ 10శాతం పెరిగి 35.2 రియాల్స్‌కు చేరింది. ట్రేడింగ్ ముందే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) ద్వారా 25.6 బిలియన్ డాలర్లు రాబట్టి చరిత్ర సృష్టించింది ఆరాంకో.
1.88 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలను అధిగమించింది ఆరాంకో. టాప్ 5 చమురు సంస్థలు మొబిల్, టోటల్, రాయల్ డచ్ షెల్, చెవ్రాన్, బీపీలనూ వెనక్కినెట్టింది.
మొత్తం 1.5 శాతం షేర్లలో 0.5శాతం షేర్లను మదుపరులకు, 1శాతం షేర్లను సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించింది ఆరాంకో. అయితే కేవలం సౌదీ పౌరులు, ఆ దేశంలో నివసేంచే వారు, గల్ఫ్ దేశస్థుల మదుపరులకు మాత్రమే ఈ షేర్లను కొనుగోలు చేసే వీలు కల్పించింది.