ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్, మొమరీ చిప్ తయారీదారైన దిగ్గజ సంస్థ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆదాయం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభాలు 56.9 శాతం పడిపోయి 4.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.30వేల కోట్ల)కు చేరాయి. 2016 మూడో త్రైమాసికం అనంతరం ఈ లాభాలే అత్యల్పం.
నిర్వహణ లాభాలు సైతం 60.2 శాతం తగ్గి 6.2 ట్రిలియన్లకు చేరాయి. అదే సమయంలో విక్రయాలు 13.5శాతం తగ్గి 52.4 ట్రిలియన్లకు చేరాయి.
దెబ్బ మీద దెబ్బ....
డిస్ప్లే సమస్యల కారణంగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మడిచే(ఫోల్డబుల్) స్మార్ట్‌ఫోన్ విడుదలను గత వారం వాయిదా వేసింది శామ్సంగ్. ఇప్పుడు ఈ ఫలితాలు సంస్థకు మరో చేదు వార్తగా ఉంది.
శామ్సంగ్కు గడ్డు పరిస్థితులు
11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియాకు శామ్సంగ్ సంస్థ చాలా ముఖ్యం. ఆ దేశంలో ఒకే కుటుంబం చేతుల్లో ఉన్న సంస్థల్లో ఇదే అతిపెద్దది.
ఉత్పత్తులను వెనక్కి పిలిపించటం సహా సంస్థ సారథి అరెస్టు లాంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాల్లో మంచి లాభాలను గడించింది శామ్సంగ్. ఈ పరిస్థితి ప్రస్తుతం మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా, పోటీ పెరిగిపోవటం... చిప్‌ల ధరలు తగ్గిపోతుండటమే దీనికి కారణంగా కనబడుతోంది.
2017 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్‌ను వెనక్కినెట్టిన హువావే రెండో స్థానాన్ని ఆక్రమించింది. తక్కువ ధరల్లో మంచి ఫోన్లను విడుదల చేస్తున్న ఈ సంస్థ నుంచి శామ్సంగ్ తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోంది.
డిమాండ్ తగ్గుదల
డిస్ప్లే, చిప్ విక్రయాల తగ్గుదల వల్ల నిర్వహణ లాభాలు మొదటి త్రైమాసికంలో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పెట్టుబడిదారులకు తెలిపింది శామ్సంగ్.
ప్రపంచంలోనే మొదటి సారిగా దేశవ్యాప్త 5జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించటానికి దక్షిణ కొరియాకు అనుమతి లభించింది. దీనితో 5జీ సామర్థ్యమున్న ఎస్10 స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను విడుదల చేసింది శామ్సంగ్.
మడిచే ఫోన్
మడిచే సౌలభ్యం ఉన్న ఫోన్ శామ్‌సంగ్‌దే మొదటిది కాకపోయినప్పటికీ... ఆ విభాగంలో మార్కెట్ వాటాను ఆ సంస్థ కైవసం చేసుకొని ఆవిష్కరణలకు ఊతమిస్తుందనే అంచనాలున్నాయి. గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్‌ను ఎనిమిది సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తోంది శామ్సంగ్.