ఈ ఏడాదిలోనే అతిపెద్ద స్వాధీనతా ఒప్పందానికి తెరలేచింది. సమాచార దిగ్గజం ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ను 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)కు సొంతం చేసుకోడానికి డేటా దిగ్గజం ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సమాచార విపణిలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీ ఈ అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్న సమాచారం ఆధారంగా, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న సంకేతాలకు ఈ మెగా ఒప్పందం ఒక నిదర్శనమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబరు త్రైమాసికం నుంచి ఒప్పందాలు పెరుగుతూ వచ్చాయని.. ఇప్పటికి లక్ష కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయని..కరోనాతో సంబంధమున్న సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోనే ఎక్కువ ఒప్పందాలు జరిగాయని అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ రీఫినిటివ్ చెబుతోంది.
మెగా ఒప్పందం ఇలా
ఒప్పందం కింద ప్రతి ఐహెచ్‌ఎస్ మార్కిట్ షేరుకు ఎస్ అండ్ పీ గ్లోబల్‌కు చెందిన 0.2838 షేర్లు లభిస్తాయని ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఒప్పందం పూర్తయ్యాక.. ఎస్ అండ్ పీ గ్లోబల్ వాటాదార్లకు సంయుక్త కంపెనీలో దాదాపు 67.75 శాతం వాటా ఉంటుంది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ వాటాదార్లకు 32.25 శాతం వరకు వాటా ఉంటుంది. ఈ లావాదేవీతో లండన్‌కు చెందిన ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఎంటర్‌ప్రైజ్ విలువ 44 బిలియన్ డాలర్లుగా తేలింది.(ఇందులో 4.8 బి. డాలర్ల రుణం కూడా ఉంది.) కాగా, సంయుక్త కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంటుంది. ఎస్ అండ్ పీ గ్లోబల్ సీఈఓ డగ్లస్ పీటర్సన్ సంయుక్త కంపెనీకి కూడా అదే హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఛైర్మన్, సీఈఓ అయిన లాన్స్ ఉగ్లా ఒప్పందం పూర్తయ్యాక ఏడాది పాటు ప్రత్యేక సలహాదారుగా ఉంటారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ఒప్పందం పూర్తి కావొచ్చు.
రెండూ భారీ కంపెనీలే
- ప్రపంచవ్యాప్తంగా దేశాలకు, కంపెనీలకు రుణ రేటింగ్‌లు ఇవ్వడంలో ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్రముఖ సంస్థగా మార్కెట్ వర్గాలకు బాగా తెలుసు. ప్రపంచవ్యాప్త క్యాపిటల్, కమొడిటీ మార్కెట్ల డేటాను కూడా ఇది అందజేస్తుంటుంది. 2011లో మెక్‌గ్రా-హిల్ నుంచి విడిపోయాక ఇది తన స్టాండలోన్ వ్యాపారాలను ప్రారంభించింది.
- ఐహెచ్‌ఎస్ మార్కిట్ విషయానికొస్తే మార్కిట్‌ను 6 బిలియన్ డాలర్లతో ఐహెచ్‌ఎస్ కొనుగోలు చేసిన అనంతరం 2016లో ఏర్పడ్డ కంపెనీ ఇది. ఆర్థిక ఆస్తులు, డెరివేటివ్‌ల ధరలు, సమాచారాన్ని మార్కిట్ అందజేస్తుండగా.. ఆటోమోటివ్, సాంకేతిక పరిశ్రమల సమాచారాన్ని ఐహెచ్‌ఎస్ అందజేస్తుండేది.
- శుక్రవారం ముగిసిన మార్కెట్ ధరల ప్రకారం..ఐహెచ్‌ఎస్ మార్కిట్ మార్కెట్ విలువ 36.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలో ఈ కంపెనీ షేరు 22 శాతం పెరగడం విశేషం.