అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలను ఆకట్టుకునేందుకు, దేశీయ కంపెనీలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం రూ.50,000 కోట్ల విలువైన మూడు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. అగ్రగామి 5 అంతర్జాతీయ మొబైల్ సంస్థలను ఆకట్టుకోవడమే లక్ష్యమని, అదే విధంగా తోడ్పాటు ఇవ్వడానికి 5 దేశీయ సంస్థలను స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా గుర్తిస్తామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ఇక్కడ తెలిపారు. 'ప్రపంచ, స్థానిక సామర్థ్యాలతో భారత్ మంచి తయారీ దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ మారిందని, ఇప్పుడు అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోందని' మంత్రి తెలిపారు.
15-20 లక్షల మందికి ఉపాధి
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వచ్చే కొన్నేళ్లలో 15 - 20 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ అన్నారు. ఈ పథకాలతో వచ్చే అయిదేళ్లలో విలువ పరంగా మొబైల్ ఉత్పత్తి రూ.8 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.5.98 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. వచ్చే 2-3 ఏళ్లలో అంతర్జాతీయ దిగ్గజ మొబైల్ సంస్థలు భారత్‌కు వస్తాయని, ఈ విభాగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. '2018-19లో మొబైల్ హ్యాండ్‌సెట్ల ఉత్పత్తి 29 కోట్లకు చేరింది. వీటి విలువ రూ.1.70 లక్షల కోట్లు. 2014-15లో రూ.38,263 కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు... 2018-19 నాటికి రూ.61,908 కోట్లకు చేరాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ వాటా 2012లో 1.3 శాతంగా ఉండగా... 2018కి 3 శాతానికి పెరిగిందని' ప్రభుత్వం తెలిపింది.
ఆ మూడు పథకాలు ఇవే
ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీకి ప్రోత్సాహం (స్పెక్స్), మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ (ఈఎంసీ 2.0), భారీ స్థాయిలో తయారీకి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహం (పీఎల్‌ఐ) పథకాలను నోటిఫై చేశారు. స్పెక్స్ కింద కంపెనీలు మూలధన వ్యయంలో 25 శాతం ప్రోత్సాహకాలను పొందుతాయి. దీని కోసం పెట్టుబడుల శ్రేణి రూ.5-1000 కోట్లుగా నిర్ణయించారు. ఈఎంసీ 2.0 కింద సంస్థలు ప్రాజెక్ట్ విలువలో 50 శాతం ప్రోత్సాహకాలను పొందొచ్చు. ఈ పథకం పరిమితి 100 ఎకరాలకు రూ.70 కోట్లుగా ఉంది. పీఎల్‌ఐ పథకం కింద.. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలపై ప్రభుత్వం 4-6 శాతం ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. 2019-20లో కనీసం రూ.10,000 కోట్ల ఏకీకృత ఆదాయం నమోదు చేయడం, రూ.15,000 పైబడిన హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్న అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు పీఎల్‌ఐ పథకానికి అర్హతగా నిర్ణయించారు. ఇక 2019-20లో రూ.100 కోట్ల కనీస ఆదాయం నమోదు చేసిన దేశీయ కంపెనీలు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది.
ఇదీ చూడండి: దిగ్గజ కంపెనీల రేటింగ్‌పై మూడీస్ దెబ్బ