ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికానికి నికర లాభం రూ.246.51 కోట్లుగా ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. మొండి రుణాలు తగ్గుముఖం పట్టినందున గత ఆర్థిక సంత్సరం క్యూ3తో పోలిస్తే ఈ లాభాలు 7.12 శాతం అధికమని బ్యాంకు పేర్కొంది.
కాగా, నీరవ్ మోదీ(రూ. 14,356 కోట్లు) కుంభకోణంలో చిక్కుకున్న పీఎన్‌బీ గడచిన ఆర్థిక సంవత్సరం రూ.230.11 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
బ్యాంకు మొత్తం ఆదాయం మాత్రం 2017-18 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 2.64 శాతం తగ్గి రూ.14,854.24 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 15,257.5 కట్లుగా ఉంది.
అదే విధంగా మొండి బాకీల మొత్తానికి కేటాయించే మొత్తాలు 2017-18 ఆర్థిక సంవత్సరంతో రూ.2,996.42 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గి 2,565.77 కోట్లుగా ఉన్నట్లు పీఎన్‌బీ వెల్లడించింది.