కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19) దేశ ఆర్థిక వ్యవస్థ మూలాధారమైన నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నష్టాలను అదుపు చేయాలని ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ విశ్లేషించింది. అంతేగాక ఆర్థిక వ్యవస్థను సత్వరం మళ్లీ గాడిలో పెట్టాలంటే ఈ రంగానికి పెద్దపీట వేయాలని తాజాగా ఒక నివేదికలో సూచించింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ వెంటనే ప్రారంభం అయ్యేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు, ఏఏ ప్రాజెక్టులు ముందుగా చేపట్టాలి- అనేది నిర్దేశించుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది. ఈ రంగంలో ఉన్న మానవ వనరులు, యంత్రసామగ్రికి వెంటనే మళ్లీ పూర్తిస్థాయిలో పని దొరకకపోవచ్చు, అందువల్ల ఆ మిగులు వనరులను వినియోగించుకోవటానికి వీలుగా ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని సూచించింది.
"కొవిడ్-19, లాక్‌డౌన్ నుంచి వచ్చే కొద్ది రోజుల్లో సడలింపు దొరకవచ్చు, ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. నిర్మాణ రంగం భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం అనేది సాధ్యం కాదు. ప్రస్తుతం నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన కార్యాచరణతో నిర్మాణ రంగ కార్యాకలాపాలు మొదలుపెట్టి వేగవంతం చేయటానికి పూనుకోవాలి" అని ఈ నివేదిక విశ్లేషించింది.
ప్రస్తుతం నిర్మాణ రంగం ఎలా ఉంది?
- దేశవ్యాప్తంగా రూ.59 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటి పైనా కోవిడ్-19 ప్రభావం పడింది. దాదాపుగా పనులన్నీ నిలిచిపోయాయి. తత్ఫలితంగా లక్షలాది మంది కార్మికులకు పని లేకుండా పోయింది. కార్మికులు కొంతమంది స్వస్థలాలకు వెళ్లిపోగా, మరి కొందరు లేబర్ క్యాంపుల్లో ఉండిపోయారు.
- మనదేశం వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కావాలంటే ‘జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక’ కింద నిర్దేశించుకున్న విధంగా భారీ 1 ప్రాజెక్టులను సత్వరం చేపట్టి పూర్తిచేయాలి.
- నిర్మాణ రంగంలో 4.9 కోట్ల మంది పనిచేస్తున్నారు. మనదేశంలో పని చేసే జనాభాలో ఈ మొత్తం 12 శాతానికి సమానం. అంతేగాక నిర్మాణ రంగంపై దాదాపు 250 రకాలైన అనుబంధ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ పనులు నిలిచిపోగా, సైట్‌లో ఉన్న కార్మికులు, ఇతర సిబ్బందిని అన్ని రకాలుగా ఆయా ప్రాజెక్టుల యాజమాన్యాలు ఆదుకోవలసి వస్తోంది. ఇది అదనపు భారం కాగా, ఆ మేరకు ప్రాజెక్టు వ్యయాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
- దేశంలోని అతిపెద్ద నిర్మాణ రంగ కంపెనీ ఒకటి, తన ప్రాజెక్టు సైట్ల వద్ద ఉన్న లేబర్ క్యాంపుల్లో ఉన్న దాదాపు 2.30 లక్షల మంది కార్మికుల కనీస అవసరా కోసం రోజుకు రూ.15 కోట్లు వెచ్చిస్తోంది.
- ఒకసారి వర్షాకాలం మొదలయితే నిర్మాణ పనులు చేపట్టటం సాధ్యం కాదు. అంటే జూన్ నెలాఖరు వరకే గడువు. అందువల్ల వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు కల్పిస్తే, కొంత మేరకు నష్టాన్ని పూడ్చుకున్నట్లు అవుతుంది.
ఈ నిర్ణయాలు మేలు చేస్తాయి...
ఆరోగ్య పరమైన సవాళ్లు తలెత్తకుండా నిర్మాణ పనుల్లోకి కార్మికులను పూర్తిస్థాయిలో తీసుకు వచ్చేందుకు, అందుకు తగిన విధివిధానాలను నిర్దేశించుకునేందుకు ఇదే సరైన తరుణమని కేపీఎంజీ ఇండియా పార్టనర్ అండ్ లీడర్ చింతన్ పటేల్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ పూర్తై నిర్మాణ ప్రాజెక్టులు మొదలు పెట్టే సమయానికి కార్మికులు స్వస్థలాల నుంచి పూర్తిస్థాయిలో రాకపోవచ్చని, మూలధన లభ్యత కూడా సమస్య అవుతుందని, అందువల్ల దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాలని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఆఫ్-సైట్, మాడ్యులార్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ప్రీ-కాస్ట్ స్ట్రక్చర్ పద్ధతులకు పెద్దపీట వేయాలని, తద్వారా నిర్మాణాల వేగం పెరుగుతుందని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురయ్యే అవరోధాలను గుర్తించాలని, సమర్థవంతమైన ప్రాజెక్టు యాజమాన్య విధానాలను ఎంపిక చేసుకొని నష్టాలను నివారించాలని వివరించింది.
వలస కార్మికుల సమస్యకు కొంత పరిష్కారం..
లాక్‌డౌన్ సడలింపుపై స్థిరాస్తి పరిశ్రమ
నిర్మాణాలు జరిగే ప్రదేశాల్లో కార్మికులు అందుబాటులో ఉంటే అటువంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభించటానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటాన్ని స్వాగతిస్తూనే, నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, స్టీలు, ఇతర వస్తువుల లభ్యత మాటేమిటని...? స్థిరాస్తి పరిశ్రమ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలను ప్రారంభించాలనే నిర్ణయంతో అటు సొంతూళ్లకు వెళ్లలేక, ఇటు చేయటానికి పనిలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికుల సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని, కానీ పనులు మొదలుపెట్టటంలో ఉన్న ఇతర ఇబ్బందులను కూడా పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి నిర్మాణాలను దశల వారీగా ప్రారంభించాలనేది సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం, వలస కార్మికులు మళ్లీ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం కలుగుతుంది- అని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హీరానందానీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం- అని క్రెడాయ్ జాతీయ ఛైర్మన్ జే.షా అన్నారు. ‘హాట్‌స్పాట్’ లకు వెలుపల ఉన్న ప్రదేశాల్లో నిర్మాణ కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోందని, కానీ దీనిపై మరింత స్పష్టత కావాలని క్రెడాయ్- ఎన్‌సీఆర్ అధ్యక్షుడు పంకజ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. కానీ నిర్మాణ సామగ్రి సరఫరా ఎలా అని? ఆయన ప్రశ్నించారు. నిర్మాణాల్లో దాదాపు 200 రకాలైన ముడిసామగ్రి, వస్తువులు వినియోగించాలి, వీటిని తయారు చేసే- సరఫరా చేసే సంస్థలు ‘లాక్‌డౌన్’ లో ఉన్నాయి కదా- అని అన్నారు. కార్మికుల్లోనూ భిన్నమైన వారు ఉంటారని, సాధారణ కార్మికులతో పాటు తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటివారు అవసరం, ఇన్ని రకాల కార్మికులు నిర్మాణ ప్రదేశంలో ఉండరని సూపర్‌టెక్ ఛైర్మన్ ఆర్‌కే అరోరా వివరించారు.