కరోనా వైరస్ ప్రభావం దేశంలో నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు భారీ దిద్దుబాటుకు లోనయ్యాయి. ఇంకా అవుతూ ఉన్నాయి. చరిత్రలో ఈ స్థాయిలో నష్టాలు రావడం ఇదే ప్రథమం.
అయితే పెట్టుబడి ప్రారంభించాలనుకునే వారికి మాత్రం ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. సిప్ రూపంలో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు ఆర్జించొచ్చని సూచిస్తున్నారు. ఇందుకు ప్రస్తుత పరిస్థితులు అత్యంత సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సంస్థల్లో పెట్టుబడులు ఉత్తమం..
ఆరోగ్య సంరక్షణ, టెలికాం రంగాలు ప్రస్తుత గడ్డుపరిస్థితుల్లో మంచి ప్రదర్శన కనబర్చే అవకాశముందని అంటున్నారు. చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా ఇంటర్నెట్, కాల్స్ వినియోగం భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టెలికాం సంస్థల ప్రదర్శన మెరుగ్గా ఉండొచ్చని అంటున్నారు.
నిపుణుల సలహాలు..
"ప్రస్తుతం ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. వీటిలో అయితే కొంత మొత్తానికి 'లిక్విడిటీ హామీ' ఉంటుంది."
- సందీప్ సిక్కా, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఈఓ.
"మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ఆపొద్దు. క్లయింట్ల దగ్గర లిక్విడిటీ ఉంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నిలకడగా పెట్టుబడి పెట్టడం మంచిది."
-ఎస్ ఏఎంసీ సీఈఓ కన్వార్ వివేక్
'కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ ప్రభావం మార్కెట్లను భారీగా కుదిపేసింది. ఈ ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 12 శాతం క్షీణించింది. 34,000 పాయింట్లు నుంచి 29,000 పాయింట్లు స్థాయికి దిగజారింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది అత్యంత ఉత్తమమైన సమయం' అని వివేక్ అభిప్రాయపడుతున్నారు.
"స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి బేర్ మార్కెట్లు ఉత్తమమైనవిగా పరిగణించాలి. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి రాబడులు వస్తాయి."
-అమిత్ జైన్, అషికా వెల్త్ అడ్వైజర్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు
'కొత్తగా పెట్టుబడి పెట్టేవారు 40 శాతం ఆర్బిట్రేజ్ ఫండ్లకు కేటాయించాలి. ఇవి సగటున 7-8 శాతం వరకు రాబడి ఇస్తాయి. 60 శాతం పెట్టుబడిని బహుళ అసెట్‌లలో, మిడ్ క్యాప్ స్కీమ్‌లలో తదుపరి ఆరు నెలల వరకు పెట్టుబడిగా పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.' అని ఆయన సలహా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లపై ఆర్థిక ప్యాకేజీ ప్రభావం పరిమితమే!