'ప్రపంచ వ్యాప్తంగా వందేళ్లకు పైబడి మనుగడ సాగిస్తూ ముందుకు సాగిపోతున్న వ్యాపార సంస్థల నుంచి నేర్చుకోవలసిన పాఠాల'పై గత వారం తొలి చర్చాగోష్ఠి నిర్వహించగా.. 'వ్యక్తులు, వ్యాపార సంస్థలు తమ బ్రాండు విలువ, ప్రతిష్ఠను కాపాడుకోవటం ఎలా.?' అనే అంశంపై శనివారం రెండో చర్చాగోష్ఠి జరిగింది. ఇందులో కుటుంబ వ్యాపార సంస్థల సలహాదారు, ఆధ్యాత్మిక నాయకుడు అయిన తత్వమసి దీక్షిత్‌తో కలిసి ప్రముఖ వ్యక్తులు, వ్యాపార సంస్థల ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారాల్లో నిపుణుడు రేచల్ ఆట్కిన్స్, ‘ప్రైవేటు రిస్కు అడ్వైజర్’గా పేరుపొందిన డేవిడ్ ఇమిసన్ పాల్గొన్నారు. వీరి విశ్లేషణ...
- భారత్‌లో 70 శాతానికి పైగా కుటుంబ వ్యాపార సంస్థలున్నాయి. భారత ఆర్థికావనిలో ఇవి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.
- ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ పద్ధతుల్లో వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తూ ఈ సంస్థలన్నీ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చిక్కుకొని ప్రతిష్ఠను కోల్పోయే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది పెద్ద సవాలుగా మారింది. వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తల గోప్యతకు చట్టం రక్షణ కల్పిస్తుంది, కానీ ప్రైవేటు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం వ్యక్తిగత బాధ్యత. ఈ విషయంలో వ్యాపారవేత్తలు తమ పిల్లలకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది.
- ఫోటోలు, పర్యటనల సమాచారం, ఇతర వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవాలి.
- ముందు జాగ్రత్త ఎంతో అవసరం. ఏదైనా జరిగిపోయిన తర్వాత దిద్దుకోలేం. ఒక పని చేసే ముందు, లేదా ఏదైనా తుది నిర్ణయం తీసుకునే సమయంలోనే దాని పర్యవసానాల గురించి ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాలి.
- ఒక వ్యాపార సంస్థ అదనపు నిధులు సమీకరించాలని అనుకున్నప్పుడు లేదా ఇతర దేశాలకు విస్తరించాలని యోచించినప్పుడు ప్రత్యర్ధులు చెడు ప్రచారంతో నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. ప్రతిష్ఠకు భంగం కలిగించటం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోవచ్చు.
- వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్ చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలి. కానీ హ్యాకర్లపై మనకు అదుపు ఉండదు. జెఫ్ బెజోస్ (అమెజాన్ వ్యవస్థాపకుడు) ఉదంతం ఇందుకో ఉదాహరణ.
- ఈవేళ ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన సమాచారాన్ని బట్టబయలు చేసి పదిమందికీ చేర్చే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలు ఇందుకు దోహదం చేస్తాయి. అలాగని ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరంగా ఉండటం కూడా సరికాదు. * తమ వ్యాపార సంస్థకు సంబంధించిన సమాచారం ఎంతవరకూ ప్రజలకు తెలియాలనుకుంటే, అంతవరకూ నెట్‌లో అందుబాటులో ఉంచాలి. దాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి.
- ఆన్‌లైన్‌లో తమకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకోవాలనే ఆసక్తి నేటి యువతరానికి ఎక్కువ. వారిని అందుకు అనుమతించాలి.
- కొన్ని వ్యాపార కుటుంబాలు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల కోసం ప్రత్యేకంగా సొంత ‘వెబ్ ప్లాట్‌ఫామ్’లను ఏర్పాటు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. తద్వారా సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించినట్లు అవుతుంది.
- వ్యాపార సంస్థల ముఖ్యమైన సమాచారం సిబ్బంది నుంచి బయటకు పొక్కకుండా జాగ్రత్త వహించాలి.
- వ్యాపార కుటుంబాల్లో ఏం జరుగుతుందనే అంశంపై ప్రజలకు ఆసక్తి ఎక్కువ. వదంతులను ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల కుటుంబ వివాదాలు బయటకు వెళ్లకుండా నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి.
- ఈరోజున సమాచారాన్ని దాచిపెట్టడం అనేది ఎంతో కష్టం. దేన్నైనా తెలుసుకోవచ్చు, రికార్డు చేయవచ్చు, దాన్ని మనకు వ్యతిరేకంగా వాడుకోవచ్చు. ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. ఒకసారి పోయిన ప్రతిష్ఠను మళ్లీ తిరిగి తెచ్చుకోవటం సాధ్యం కాదు. అందువల్ల అప్రమత్తంగా ఉండటమే మార్గం.
వందేళ్ల కుటుంబ సంస్థలు ఏంచెబుతున్నాయంటే..
ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైబడి మనుగడ సాగిస్తూ ముందుకు సాగిపోతున్న వ్యాపార సంస్థల నుంచి నేర్చుకోవలసిన అంశాలపై గత వారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అవేమిటంటే.. కుటుంబ వ్యాపార సంస్థల్లో తొలితరం వేసిన పునాదిని రెండోతరం పటిష్ఠపరచుకుంటూ, విస్తరించుకుంటూ ముందుకు సాగితే.. మూడోతరం దూకుడుగా వ్యవహరించడానికి, కొత్త నిర్ణయాలతో ముందుకు సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబ సమావేశాల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుంది.
కొత్త తరానికి పెద్దల సలహా అవసరం. మూడో తరం వ్యాపారవేత్తల సామర్థ్యం ఎంతో అధికం. సవాళ్లు ఎదుర్కొనడాన్ని ఇష్టపడతారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. వారితో వ్యాపార వ్యవహారాలు, లాభదాయకత, సామాజిక బాధ్యత... వంటి అంశాలను కుటుంబ వ్యాపార సంస్థల పెద్దలు కూలంకషంగా చర్చించాలి. కొత్త తరం ప్రతినిధులు అందరూ వ్యాపార నిర్వహణలోకి రావాలన్న నిబంధనేమీ లేదు. కొందరు స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలు చూడవచ్చు. కుటుంబ వ్యాపార సంస్థల సారథిగా కొత్త తరంలో సామర్థ్యానికే పెద్ద పీట వేయాలి. 'కుటుంబం అనేది వ్యాపార సంస్థలను కలిపి ఉంచుతుంది... అదేవిధంగా వ్యాపారం కుటుంబాన్ని కలిసికట్టుగా ఉంచుతుంది.'
ఇదీ చదవండి: వీధి వ్యాపారుల 'సూక్ష్మ రుణ పథకాన్ని' సమీక్షించిన పీఎం