ఫేస్బుక్ తన వెబ్సైట్లో వార్తలు అందించాలని కోరుతూ ప్రచురణకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వార్తల ప్రచురణ హక్కుల కోసం మిలియన్ల డాలర్లు చెల్లించడానికీ ఫేస్బుక్ సిద్ధమైనట్లు వినికిడి.
వార్తా పరిశ్రమకు హాని కలిగించేలా ఇన్నాళ్లూ ఫేస్బుక్ ఆన్లైన్ ప్రకటనలపై గుత్తాధిపత్యం వహించింది. దీనిపై ఏళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
వార్తా కథనాలు, ముఖ్యాంశాలు, ఇతర విషయాలపై లైసెన్స్ పొందడానికి ఏడాదికి 3 మిలియన్ డాలర్లు అందిస్తామని ఫేస్బుక్ ప్రతినిధిలు... న్యూస్‌కార్ప్ సంస్థకు ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఈ వార్తపై స్పందించడానికి ఫేస్బుక్ నిరాకరించింది.
అవును.... సంప్రదించారు
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలకు లైసెన్స్ చెల్లించడం గురించి న్యూస్ కార్ప్‌ను ఫేస్బుక్ సంప్రదించినట్లు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి ధ్రువీకరించారు.
ఫేస్బుక్ తమతో చర్చలు జరిపిన విషయంపై వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ యాజమాని వాల్ట్ డిస్నీకో స్పందించలేదు.
ఫేస్బుక్... న్యూస్ ట్యాబ్
ప్రత్యేకంగా వార్తలు చూసుకునేందుకు వీలుగా 'న్యూస్ ట్యాబ్' సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫేస్బుక్ ధ్రువీకరించింది. ఏప్రిల్ నుంచి ఈ విషయమై వార్తా విభాగంతో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.
స్పష్టత లేదు
ఫేస్బుక్ వ్యక్తిగత ప్రచురణకర్తలకు 3 మిలియన్ డాలర్లు ఇస్తుందా లేదా మొత్తం అన్ని వార్తా సంస్థలకు కలిపి ఇస్తుందా అనే విషయాన్ని వాల్‌స్ట్రీట్ స్పష్టం చేయలేదు.
ఉచితంగా వాడుకున్నాయ్
ఫేస్బుక్, గూగుల్... తమ కంటెంట్‌ను పూర్తి ఉచితంగా వాడుకుని, డిజిటల్ యాడ్ల రూపంలో డాలర్లు గడిస్తున్నాయని, ఇది తమకు ఎంతో నష్టాన్ని కలిగిస్తోందని వార్తా పరిశ్రమ ఏళ్లుగా విమర్శలు చేస్తూనే ఉంది.
ఇదీ చదవండి: 'వార్తలు వారివి... కోట్ల డాలర్లు గూగుల్వి'