King Of Indian Retail: భారత రిటైల్ రంగ రారాజుగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 'రిలయన్స్ రిటైల్' అవతరించనుందని బెర్న్‌స్టీన్ నివేదిక పేర్కొంది. కరోనా సంక్షోభం తర్వాత సంస్థ రిటైల్ విక్రయశాలలు 39 శాతం (చదరపు అడుగుల పరంగా) పెరిగాయి. బహుళ బ్రాండ్‌లు, డిజిటల్ కామర్స్‌లో విస్తరణ.. సంస్థకు దోహదపడుతున్నాయని, ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను దక్కించుకోనుండటమూ మరింత కలిసిరావొచ్చని విశ్లేషకులు తెలిపారు. రెవెన్యూ, విక్రయశాలల పరంగా భారత్‌లో అతిపెద్ద వ్యవస్థీకృత రిటైలర్‌గా రిలయన్స్ రిటైల్ నిలిచిందని బెర్న్‌స్టీన్ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థకు 40 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 14,412 స్టోర్‌లు ఉన్నాయి. గత అయిదేళ్లలో కంపెనీ ఆదాయం 5 రెట్లు అధికమైంది. మూల రిటైల్ ఆదాయమైన 18 బిలియన్ డాలర్లు.. పోటీ సంస్థల మొత్తం కలిపినా ఎక్కువ కాగా, వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) 40 శాతం అత్యుత్తమని వివరించింది. 'న్యూ కామర్స్', ఆఫ్‌లైన్ రిటైల్, ఇ-కామర్స్ విభాగాల్లో ఎండ్ టూ ఎండ్ వ్యూహాన్ని కంపెనీ నెలకొల్పిందని తెలిపింది.
గ్రోసరీ రెండంకెల వృద్ధి సాధించగా, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ రెండింతలు పెరిగాయి. డిజిటల్/న్యూకామర్స్ మొత్తం కోర్ రిటైల్‌లో 20 శాతం వాటాకు చేరాయి. కోర్ రిటైల్‌లోని గ్రోసరీ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తుల విభాగాలు బలమైన వృద్ధి కొనసాగించాయి. నాన్-కోర్ రిటైల్‌లో జియో స్టోర్లు, రిటైల్ భాగస్వాముల వాటా ఉంది.
మార్జిన్‌ల వృద్ధితో రిలయన్స్ రిటైల్ 2021-25 మధ్య 30 శాతం సీఏజీఆర్‌ను నమోదుచేయొచ్చని బెర్న్‌స్టీల్ అంచనా వేసింది. ప్రస్తుతం కంపెనీ గణాంకాల ప్రకారం.. ఆదాయంలో గ్రోసరీ 21.2 శాతం, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ 27.4 శాతం, ఫ్యాషన్ 8.3 శాతం, జియో స్టోర్లు 34.3 శాతం ,పెట్రోల్ రిటైల్ 8.7 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విమానాల ఖర్చు ఎంతో తెలుసా?