ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 12 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో నికరంగా రూ.13,101 కోట్లు లాభపడింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.11,640 కోట్లు ఆర్జించినట్టు ఆ సంస్థ పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో అన్ని కార్యకలాపాల ద్వారా రూ.1,28,450 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది రిలయన్స్. ఏడాది క్రితం ఇది రూ.1,57,165 కోట్లుగా ఉండటం గమనార్హం.
రిలయన్స్ జియోలోనూ..
డిజిటల్, టెలికామ్ సేవల్ని అందిస్తోన్న జియో ప్లాట్‌ఫామ్స్‌లో భారీ లాభాలను ఆర్జించింది రిలయన్స్. 2020 అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో.. రిలయన్స్ జియో నికర లాభం 15.5 శాతం మేర పెరిగి.. రూ.3,489 కోట్లకు చేరిందని దాని మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తెలిపింది. అంతకుముందు త్రైమాసికంలో అది రూ. 3,020 కోట్లుగా నమోదైంది.
2020 డిసెంబర్ చివరి నాటికి మొత్తం 41కోట్ల మంది జియో కస్టమర్లతో.. క్యూ3లో రూ.22,858 కోట్ల రాబడి పొందినట్టు తెలిపింది రిలయన్స్. క్యూ3లో ఒక్కో వినియోగదారుని నుంచి సగటున నెలకు రూ.145 ఆదాయం పొందగా... క్యూ2లో ఈ ఆదాయం రూ.151 గా ఉండేదని తెలిపింది.
ఇదీ చదవండి: బ్యాడ్ బ్యాంక్‌తో ఎన్పీఏ సమస్యకు చెక్!