ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల టాప్-50 కంపెనీల జాబితాలో 48వ స్థానం దక్కించుకుంది. సంస్థ ఎం-క్యాప్ రూ.13లక్షల కోట్లు దాటడం వల్ల ఇది సాధ్యమైంది.
గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ షేరు విలువ రూ.2060గా ఉంది. గత సెషన్‌తో పోల్చితే 2.82శాతం వృద్ధి సాధించింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.13లక్షల కోట్లు దాటింది. ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఏ ఇతర సంస్థ కూడా ఇంత మార్కెట్ విలువను సాధించలేకపోయింది.
1.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువై కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఉన్నాయి.
రిలయన్స్‌తో పాటు భారత్ నుంచి టీసీఎస్ మాత్రమే టాప్-100 కంపెనీల జాబితాలో ఉంది.
అత్యధిక ఎం-క్యాప్ విలువ గల ఆసియా కంపెనీల్లో 10వ స్థానంలో ఉంది రిలయన్స్. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ 7వ స్థానంలో ఉంది.
ఇదీ చూడండి: రికార్డు స్థాయికి బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే..