ఆ తలనొప్పులకు చెక్‌పెట్టే Headspace App
ఇంటి నుంచి పని చేయడం అంటే అంత తేలిక కాదు. అక్క కూతురో.. అన్న కొడుకో.. పక్కింటి పిల్లలో ఒకటే అల్లరి. వంట గదిలో నుంచి ప్రెజర్ కుక్కర్ విజిల్స్, మిక్సీ అరుపులూ.. వీటన్నింటితో ఎప్పుడో ఒకప్పుడు తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు కాస్త రిలాక్స్ అయ్యేందుకే ఈ యాప్. నిమిషాల నిడివిలో మెడిటేషన్ సెషన్లున్నాయి. ప్లే చేసుకుని పనికి ముందు లేదా మధ్యమధ్యలో కాసేపు ధ్యానం చేయొచ్చు.. సులువుగా రీఫ్రెష్ కూడా అవ్వొచ్చు.
'నీళ్లని' గుర్తుచేసే Hydro Coach App
ఇల్లు, ఆఫీస్ అనే తేడా లేకుండా పనిలో పడి ప్రపంచాన్నే మర్చిపోతాం. ఇంకా నీళ్లు తాగాలని ఏం గుర్తుంటుంది. అసలే ఇది వేసవి. గదిలో ఒక్కరే కూర్చుని నీళ్లు తాగడం మర్చిపోతే.. తెలియకుండానే తలనొప్ఫి. చికాకు మొదలవుతాయి. అందుకే మీ ఫోనే మీకు నీళ్లు తాగమని గుర్తు చేస్తుంది. అందుకు తగిన యాప్ ఇది. ఎంత నీరు కావాలి? రోజులో మీరెన్ని లీటర్లు తాగుతున్నారు? లాంటి వివరాల్ని ట్రాక్ చేసి చెబుతుంది. ఎప్పుడెప్పుడు నీరు తాగాలో రిమైండర్‌ని సెట్ చేసి పెట్టుకోవచ్చు.
సమావేశ వేదికగా join.me App
ప్రాజెక్టు కోడింగ్‌లోనో.. వెబ్ డిజైన్‌లోనో.. ఏదో సందేహం. బృంద సభ్యులతోనో.. టీఎల్‌తో మాట్లాడాలంటే.. సింపుల్‌గా మీ ఫోన్‌లో ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి వాడేయండి. క్షణాల్లో అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవచ్చు. డేటాని షేర్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు సమావేశం అవ్వాలనేది ముందే నిర్ణయించుకుని షెడ్యూల్ చేయొచ్చు. మీ సమావేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు 'మీటింగ్ లాక్' ఉంది.
Tide App తో హాయిగా ప్లాన్ చేయండి
తగినంత సమయం నిద్ర.. మనసుకి హాయిగా అనిపించే వేకువ జాము మెలకువ.. అప్పుడప్పుడు పని మధ్యలో తీసుకునే బ్రేక్‌లు.. ప్రశాంతతతో కూడిన ధ్యానం.. ఇవన్నీ ఏకాగ్రత, స్కిల్‌ని పెంచుతాయి.. వీటన్నింటినీ మీరు రోజువారీ లైఫ్ స్టైల్‌లోకి తెస్తుందీ యాప్. చేస్తున్న పనిపై కాకుండా వేరే వాటిపై మీ దృష్టి మరలకుండా ఉండేందుకు 'ఫోకస్' ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే స్లీప్ మోడ్‌ని ఎంచుకోవచ్చు. ఇలా మరెన్నో ఆప్షన్‌లను వాడుకోవచ్చు.
ఫోన్‌ను పక్కన పెట్టేసేలా చేసే Forest App
పదే పదే ఫోన్‌ని చూస్తుండడంతో పని ముందుకు సాగడం లేదా? అయితే, ఓ మొక్కను నాటి ఫోన్‌ని దూరంగా పెట్టొచ్చు. అందుకే ఈ యాప్. ఇన్‌స్టాల్ చేసి ఫోన్‌లో విత్తనాన్ని నాటి.. ఫోన్‌ని పక్కన ఉంచాలి. మీరెంచుకున్న సమయం లోపు ఫోన్ జోలికి పోకుంటే... ఆ విత్తనం మొలకెత్తి వృక్షంగా మారుతుంది. మీకు స్కోర్ వస్తుంది. మధ్యలో ఫోన్‌ని ముట్టారా.. చెట్టు చనిపోతుంది. మీరు మంచి స్కోర్ సాధిస్తే నిజమైన మొక్కని నాటే ప్రక్రియను యాప్ నిర్వహిస్తోంది. పనితో పాటు కాస్త ప్రకృతికీ సాయం చేయొచ్చన్నమాట.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం సరిగ్గా చేస్తోంది 0.2% ఉద్యోగులే!