మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు టీడీఎస్, టీసీఎస్ రేట్లు తగ్గించింది. అయితే ఈ ప్రయోజనం కేవలం పాన్ లేదా ఆధార్ కార్డు వివరాలు సమర్పించినవారికేనని కేంద్రం తెలిపింది.
ట్యాక్స్ రిటర్నులు సమర్పించే సమయంలో పాన్, ఆధార్ వివరాలు ఇవ్వని చెల్లింపుదారులకు నూతన రేట్లు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేట్ల తగ్గింపు
ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు ప్రభుత్వం.. ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట కలిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. వేతనం మినహా వివిధ రకాల ఇతర ఆదాయాలపై చెల్లించే మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)తో పాటు, చెల్లింపులను స్వీకరించే వారు వసూలు చేసే మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్)లో 25శాతం తగ్గింపును ప్రకటించింది.
దీని ద్వారా ప్రజలకు రూ.50,000 కోట్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ తగ్గింపు వర్తించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో పరిశ్రమకు సీతమ్మ వరాలు