'స్మార్టర్ డిజిటల్ పేమెంట్స్' అంశంపై (global hackathon 2021) మొదటి అంతర్జాతీయ హాకథాన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్వహిస్తోంది. 'హర్‌బింగర్ 2021- ఇన్నోవేషన్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్' పేరుతో జరుపుతున్న ఈ 'హాకథాన్' కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 15న ప్రారంభం కానుంది. డిజిటల్ చెల్లింపుల సేవలను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడం, చెల్లింపు ప్రక్రియను, వినియోగదారుల అనుభూతిని మరింతగా మెరుగు పరచడం, డిజిటల్ చెల్లింపుల భద్రతను బలోపేతం చేయడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సొల్యూషన్లను అభివృద్ధి చేసే ఆలోచనలను హాకథాన్ కింద ఆర్‌బీఐ ఆహ్వానిస్తోంది. చెల్లింపులు, సెటెల్‌మెంట్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించే వినూత్న ఆలోచనలనూ పంచుకోవచ్చు. ఇవి ఆచరణలోకి తెచ్చేందుకు సులభంగా ఉండాలి. చిన్న మొత్తం నగదు లావాదేవీలను డిజిటల్ విధానంలోకి మార్చేందుకు నాన్ మొబైల్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ల అభివృద్ధి, డిజిటల్ చెల్లింపుల్లో మోసాలు, అవరోధాలను గుర్తించేందుకు సామాజిక మాధ్యమాల విశ్లేషణ, పర్యవేక్షణకు సంబంధించీ తమ (digital banking hackathon ideas) ఆలోచనలను తెలియజేయవచ్చు. ఈ హాకథాన్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.40 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారు.
కేకేఆర్ ఇండియా సీనియర్ సలహాదారుగా కామత్
బ్యాంకింగ్ రంగంలో 5 దశాబ్దాల అనుభవం కలిగిన కేవీ కామత్‌ను (banking hackathon ideas) సీనియర్ సలహాదారుగా నియమించుకున్నట్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేఆర్ ఇండియా పేర్కొంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 'ఆయన అనుభవంతో దేశ వృద్ధికి మా పెట్టుబడులు కొనసాగిస్తామ'ని కేకేఆర్ ఇండియా భాగస్వామి, సీఈఓ గౌరవ్ ట్రెహాన్ వెల్లడించారు. గౌరవ్ సహా కేకేఆర్ జట్టుతో కలిసి పని చేసే అవకాశంపై సంతోషంగా ఉన్నానని కామత్ పేర్కొన్నారు. ఇటీవలి వరకు బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు తొలి ప్రెసిడెంట్‌గా (2015-20) కామత్ ఉన్నారు. దీనికి ముందు ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. గత నెలలో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్‌కు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.