RBI Monetary Policy: నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. మరోసారి కీలక వడ్డీ రేట్లను వరుసగా 9వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 9.5గా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. మూడో త్రైమాసికంలో 6.6శాతం, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో నికర జీడీపీ వృద్ధిరేటు 17.2 శాతంగా , రెండో క్వార్టర్లో 7.8శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
కొవిడ్ కారణంగా కుంగిన భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుందని శక్తికాంత దాస్ తెలిపారు. మహమ్మారి మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఇటీవల పన్నులు తగ్గించిన నేపథ్యంలో వినిమయ గిరాకీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నవంబరులో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం కిందకు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.
ఎంపీసీ సమీక్ష హైలైట్స్..
- వరుసగా 9వ సారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం.
- రెపోరేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచుతున్నట్లు ప్రకటన.
- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 4.25 శాతంగా కొనసాగింపు.
- ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 9.5శాతంగా ఉంటుందని అంచనా.
- మూడో త్రైమాసికంలో 6.6గా, నాలుగో త్రైమాసికంలో 6గా వృద్ధిరేటు అంచనా.
- వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 17.2శాతంగా అంచనా.
- భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.
- ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉంటుందన్న శక్తికాంత్ దాస్.
- పెట్రోల్, డీజిల్ ధరలపై తగ్గిన పన్నులతో వినిమయ గిరాకీ పుంజుకుంటుందన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.
- విదేశీ శాఖల్లో మూలధనాన్ని నింపడానికి, లాభాలను స్వదేశానికి రప్పించడానికి బ్యాంకులకు ముందస్తు అనుమతి అవసరం లేదన్న ఆర్బీఐ గవర్నర్.
- డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగదారులపై విధించే ఛార్జీలను సమీక్షించాలని ప్రతిపాదించిన ఆర్బీఐ.
- యూపీఐ పేమెంట్స్‌ను పెంచే దిశగా చర్యలు.
- ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరగనున్న తదుపరి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం.