ఒకప్పుడు చుట్టాలూ బంధువుల ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్లన్నీ కంఠస్థం ఉండేవి. సెల్‌ఫోన్ల పుణ్యమా అని అవన్నీ ఫోన్ కాంటాక్టుల్లోకి చేరిపోవడంతో గుర్తుపెట్టుకోవడమనేదే మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భం రాబోతోంది. కాకపోతే ఈ సారి క్రెడిట్/ డెబిట్ కార్డుపై ఉండే 16 అంకెల నంబర్లను! కేవలం నంబర్లే కాదు గడువు తేదీ, సీవీవీ వంటివీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డేటా స్టోరేజీకి సంబంధించి ఆర్‌బీఐ త్వరలోనే నిబంధనలను మార్చనుండడమే ఇందుకు కారణం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, పేమెంట్ సంస్థలను ఉపయోగించి ఒకసారి మనం క్రెడిట్/డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే మరోసారి లావాదేవీ జరిపేటప్పుడు కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది. ఒకసారి పేమెంట్ చేశాక మన కార్డు వివరాలన్నీ వారి డేటా బేస్‌లో స్టోర్ అయ్యేవి. అయితే, ఆర్థిక మోసాల నివారణకు డేటా స్టోరేజీకి సంబంధించి నిబంధనలను ఆర్‌బీఐ మార్చనుంది. దీని ప్రకారం ఇకపై ఇ -కామర్స్ సంస్థలు, పేమెంట్ అగ్రిగేటర్లు కార్డు వివరాలను స్టోర్ చేయడానికి వీలుండదు. అంటే లావాదేవీ జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఎంటర్ చేయాలన్నమాట. గతంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో వంటి కంపెనీలు ఈ నిబంధనను వ్యతిరేకించాయి. దీనివల్ల డిజిటల్ పేమెంట్లపై ప్రభావం పడుతుందని వాదించాయి. అయినా, ఖాతాదారుల భద్రత దృష్ట్యా దీన్ని ఆర్‌బీఐ కొట్టిపారేసింది. త్వరలో ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. కాబట్టి ఇకపై కార్డు డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవడమో, లేదంటే కార్డును చూసి ప్రతిసారీ ఎంటర్ చేయడమో చేయాల్సిందే. గుర్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి, రెండు కార్డులున్నవారి పరిస్థితి కొంత పర్లేదు.. అంతకంటే ఎక్కువ కార్డులున్న వారికే అసలు సమస్య!
ఇదీ చూడండి: Electric vehicles: ఆన్లైన్లో జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!