ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆగస్టు 4న ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సమావేశం గురువారం ముగియనుంది. అనంతరం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ఆర్బీఐ ప్రకటన చేయనుంది.
రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో కీలకమైన బెంచ్మార్క్ వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు యధాతథంగా కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కరోనావైరస్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు రుణాల పునర్నిర్మాణం వంటి ఇతర చర్యలు ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.
తగ్గించే అవకాశం!
అయితే ద్రవ్యోల్బణం పెరిగినా వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గిస్తుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని మరో రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది.
భిన్నాభిప్రాయాలున్నా...
వడ్డీ రేట్ల తగ్గింపుపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాల పునర్నిర్మాణం వంటి చర్యలు అత్యావశ్యకమని నిపుణులు చెబుతున్నారు.
'పునర్నిర్మాణంపై ప్రస్తుతం మేం దృష్టిసారించాం. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంద'ని గతవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
మారటోరియంపైనా...
మరోవైపు రుణాలపై మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ విషయంపైనా ఆర్బీఐ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ విధానం దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో మారటోరియాన్ని పొడగించవద్దని బ్యాంకర్లు కోరుతున్నారు. కాబట్టి ఈ విషయంపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..
ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. కరోనా కారణంగా నగదుకు ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. రెండు సార్లు వడ్డీ తగ్గింపుతో రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.