ఎస్ బ్యాంకుపై మారటోరియం ఎత్తివేసిన భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు సమస్యను అధిగమించేందుకు క్రెడిట్ లైన్‌ను రూ.60,000 కోట్లకు పెంచింది. దీంతో ఖాతాదారులకు సరిపడా నగదు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంకులో నగదు కొరత మినహా ఎలాంటి సమస్యలు లేవని ఆర్బీఐ గుర్తించినట్లు కేంద్ర బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. ఒక షరతుతో లైన్ ఆఫ్ క్రెడిట్‌ను పెంచినట్లు పేర్కొన్నారు అధికారులు. ఆర్బీఐ నుంచి నిధులను పొందాలంటే ముందుగా బ్యాంకులోని సొమ్మును పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు.
గవర్నర్ భరోసా..
లైన్ ఆఫ్ క్రెడిట్ పెంపుపై గత సోమవారమే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా కల్పించారు. మారటోరియం ఎత్తివేసిన తర్వాత నగదు అవసరమైతే అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్ బ్యాంకులో తగినంత నగదు అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు భారత చరిత్రలో ఏ బ్యాంకు ఖాతాదారులు తమ సొమ్మును కోల్పోయిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 17 ప్రకారం.. కేంద్ర బ్యాంకు దేశంలోని ఇతర బ్యాంకులకు రుణాలు, అడ్వాన్సుల రూపంలో నగదు సహాయం అందిస్తుంది.
మారటోరియం విధింపుతో..
అప్పుల ఉబిలో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్న ఎస్ బ్యాంకుపై మార్చి 5న మారటోరియం విధించింది ఆర్బీఐ. నగదు ఉపసంహరణను రూ.50 వేలకు పరిమితం చేయటం సహా పలు ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి బ్యాంకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.