RBI Digital Currency: ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీకి సంబంధించిన నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెలలో ప్రకటించవచ్చని ఆర్‌బీఐ ఫిన్‌టెక్ విభాగ జనరల్ మేనేజర్ అనుజ్ రంజన్ తెలిపారు. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టు కింద తీసుకురావొచ్చని.. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ సృష్టికి అవసరమైన చట్టపరమైన మార్పులు ముందస్తు దశల్లో ఉన్నట్లు చెప్పారు.
"వచ్చే 3-6 నెలల్లో ఈ దిశగా చాలా సానుకూల నిర్ణయాలు ఉండొచ్చు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) కోసం అవసరమైన వ్యవస్థ, డిజైన్ ఎంపికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలు ఇప్పటికే ముందుకు సాగుతున్నాయి. డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణకు చట్టపరమైన సవరణలు కీలకం. ఇందు కోసం ఆర్‌బీఐ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. డిజిటల్ కరెన్సీపై విశ్వాసం పెరిగితే ప్రజల వాడకం పెరుగుతుంది. అపుడు తక్కువ నగదు ఉండే ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది."
-- అనుజ్ రంజన్, ఆర్‌బీఐ ఫిన్‌టెక్ విభాగ జనరల్ మేనేజర్
కరెన్సీ నోట్లతో పాటు చెలామణీ అయ్యేలా డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ఆర్‌బీఐ చట్టం-1934కు మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఆర్‌బీఐ కోరిందని ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్ ఛౌద్రి ఇటీవల వెల్లడించారు.
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌లోనూ పసిడి బాండ్ల విక్రయాలు
కొత్తగా ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌లోనూ పసిడి బాండ్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో విడత పసిడి బాండ్ల పథకానికి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఎంపిక చేసిన తపాలా కార్యాలయాలు, గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీలు మాత్రమే పసిడి బాండ్లు విక్రయించేవి.
ఇకపై ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా కూడా పసిడి బాండ్ల కొనుగోలుకు అవకాశం కల్పించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రిలయన్స్ కేపిటల్ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభం
దివాలా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద రిలయన్స్ కేపిటల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించే నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), ముంబయి బెంచ్‌కు ఇందుకోసం దరఖాస్తు సమర్పించింది. దీంతో రిలయన్స్ కేపిటల్‌పై తాత్కాలిక మారటోరియం నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
దీని ప్రకారం.. ఏ రుణ సంస్థ రిలయన్స్ కేపిటల్ ఆస్తులను విక్రయించడం లేదా ఎవరికీ బదిలీ చేయకూడదు. రుణాల చెల్లింపులో విఫలమైన నేపథ్యంలో నవంబరు 29న రిలయన్స్ కేపిటల్ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అడ్మినిస్ట్రేటర్‌గా వై.నాగేశ్వరరావు (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు)ను నియమించింది.
ఇదీ చూడండి: బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల సమ్మె.. ఈ తేదీల్లో...