ముద్రా రుణాల్లో మొండి బకాయిలు పెరుగుతుండటంపై బ్యాంకులను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు ఎం.కె.జైన్ హెచ్చరించారు. ఈ రుణాలను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తుండాలని సూచించారు. ఈ రంగ రుణాల వృద్ధిలో సుస్థిరత్వం లోపిస్తే మొత్తం వ్యవస్థకే ఇబ్బందికర పరిణామం అవుతుందని అన్నారు.సూక్ష్మ రుణాలపై సిడ్బీ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ ఈ విషయంపై మాట్టాడారు. చిన్న వ్యాపారులకు త్వరితగతిన రూ.10 లక్షల వరకు రుణాలు అందించే ఉద్దేశంతో 2015 ఏప్రిల్‌లో ముద్రా రుణ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
"ముద్రా రుణాలు పరిశీలించదగిన అంశం. ఈ పథకం ద్వారా చాలా మంది పేదరికం నుంచి బయటపడినప్పటికీ.. నిరర్థక ఆస్తులు పెరగడం కొంత ఆందోళనను కలిగిస్తోంది. . ఫలానా వ్యక్తి లేదా సంస్థకు రుణాన్ని తిరిగి చెల్లించే స్థోమత ఉందా లేదా అని రుణం ఇవ్వడానికి ముందే బ్యాంకులు అంచనా వేయాల్సిన అవసరం ఉంది."
- ఎం.కె.జైన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు.
జులైలో పార్లమెంటుకు ప్రభుత్వం తెలియజేసిన సమాచారం ప్రకారం.. రూ.3.21 లక్షల కోట్ల ముద్రా రుణాల్లో నిరర్థక ఆస్తులు 2017-18లో 2.52 శాతం ఉండగా, 2018-19లో 2.68 శాతానికి పెరిగాయి.
ఇదీ చూడండి : ప్రమాణ తేదీ మార్పు.. నవంబర్ 28న ఠాక్రే పట్టాభిషేకం