కరోనా లాక్‌డౌన్‌తో కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు చేయూత అందిస్తూ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. కేంద్రం రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్... రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతానికి పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. రివర్స్ రెపో రేటును 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. 2000 సంవత్సరం తర్వాత వడ్డీ రేట్లకు ఇదే కనిష్ఠస్థాయి అని వివరించారు ఆర్‌బీఐ గవర్నర్.
రెండు నెలల వ్యవధిలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండో సారి. మార్చి 27న వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర కుదించింది కేంద్ర బ్యాంకు.
90 రోజుల మారటోరియం
టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు శక్తికాంత దాస్. వర్కింగ్ క్యాపిటల్ వడ్డీపైనా మారటోరియాన్ని మూడు నెలలు పొడిగించారు. కార్పొరేట్ సంస్థలకు మరిన్ని రుణాలు అందించడానికి వీలు కల్పించే బ్యాంక్ ఎక్స్పోజర్ను సంస్థల నికర విలువలో 30 శాతానికి పెంచారు. అంతకుముందు ఈ ఎక్స్పోజర్ 25 శాతంగా ఉంది.
ద్రవ్యోల్బణంపై అనిశ్చితి
2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రెండో అర్ధభాగంలో వృద్ధి కాస్త పుంజుకోవచ్చని అంచనా వేశారు.
కొవిడ్-19 వల్ల పప్పు ధాన్యాలు, ఇతర ధరలపై ఆందోళన నెలకొందని అన్నారు గవర్నర్. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై తీవ్ర అనిశ్చితి ఏర్పడిందని అన్నారు. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు, నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4శాతానికి దిగువకు పడిపోతుందని అంచనా వేశారు. పప్పు ధాన్యాల దిగుమతి సుంకాలపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పెరిగిన ఫారెక్స్ నిల్వలు
ఆర్‌బీఐ నుంచి ఎక్జిమ్ బ్యాంక్‌కు రూ. 15 వేల కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎక్స్పోర్ట్ క్రెడిట్‌ను 12 నెలల నుంచి 15 నెలలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. మే 15 నాటికి ఫారెక్స్ నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి.. 487 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు.
ఉత్పత్తికి విఘాతం
లాక్డౌన్ కారణంగా పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు శక్తికాంతదాస్. 60శాతం ఉత్పత్తికి కారణమయ్యే 6 పారిశ్రామిక రాష్ట్రాలు ఇప్పుడు రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయని పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. సిమెంట్ ఉత్పత్తి 25 శాతం తగ్గిందని తెలిపారు.
మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయిందని, ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూ లేనంత క్షీణత నమోదు చేసిందని శక్తికాంతదాస్ వివరించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఆహార భద్రతకు భరోసా ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేశారు.
"వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడం వల్ల ఆ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గింది"
- శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్
కొవిడ్ మహమ్మారి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.