కరోనా కోరల్లో చిక్కిన భారత్‌ను ఆదుకునేందుకు పలు సంస్థలు పెద్ద మనసు చేసుకుంటున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ 5 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఇందులో 3 మిలియన్ డాలర్లను కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు అందించనున్నట్లు తెలిపింది. మరో 2మిలియన్ డాలర్లతో వంద ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 3వేల సిలిండర్‌లు, ఇతర ఆరోగ్య పరికరాలను అందించనున్నట్లు సామ్‌సంగ్ వెల్లడించింది.
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పేటీఎం చేయూత..
ఆన్‌లైన్ చెల్లింపుల సంస్ధ పేటీఎం కూడా కరోనా వేళ చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. దేశంలోని 12 నుంచి 13 నగరాల్లోని ఆసుపత్రుల్లో పేటీఎం ఫౌండేషన్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆసుపత్రులకు మరో 21వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందించనున్నట్లు వెల్లడించింది.
రేథియాన్ టెక్నాలజీస్ సాయం..
అమెరికా చెందిన ఏరోస్పేస్ దిగ్గజం రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ కరోనా సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న భారత్‌కు సాయంగా వేయి ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లను పంపనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి చెందిన 5వేల మంది భారత్‌లో పని చేస్తున్నట్లు తెలిపిన సంస్థ... భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం తరఫున ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వాటిని తరలించినట్లు తెలిపింది.
అండగా నిలిచిన యాక్సెంచర్..
భారత్‌కు రూ.185 కోట్లు విరాళంగా ప్రకటించింది గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్. వైరస్‌పై ప్రభుత్వం చేస్తున్న కట్టడి చర్యలకు ఈ మొత్తాన్ని వినియోగించాలని నిర్ణయించింది. ప్రజలకు వ్యాక్సినేషన్ క్యాంప్‌లకు సంబంధించిన సమాచారం ఇవ్వడం సహా స్థానిక భాషల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నట్లు యాక్సెంచర్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖా మేనన్ తెలిపారు.
ఇవీ చూడండి: భారత్‌కు రూ.510 కోట్లతో ఫైజర్ ఔషధ సాయం!