టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్నారు. పాలస్తీనాతో పాటు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, సుస్థిరాభివృద్ధిని నెలకొల్పే ఆవిష్కరణలను ప్రోత్సహించినందుకుగాను 'గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ ఆండ్ పీస్' అవార్డ్‌కు ఎంపిక చేసింది.. ఇండో-ఇజ్రయిల్ ఛాంబర్ అఫ్ కామర్స్. డిసెంబర్ 21న దుబాయ్‌లో జరగనున్న ఇండో-ఇజ్రాయిల్ అంతర్జాతీయ సమాఖ్య ప్రారంభోత్సవంలో పరస్కారం ప్రదానం చేయనున్నారు.
"ఇండియా, ఇజ్రాయిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి రతన్ టాటా ఎంతో కృషి చేశారు. పాలస్తీనాతో సహా గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు పాటుపడే ఆవిష్కరణలకు మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్‌ను కొన్ని సార్లు సందర్శించారు టాటా. అది ఇరుదేశాల బంధాలు బలపడేందుకు సాయపడింది. ఈ పురస్కారానికి రతన్ టాటా తగిన వ్యక్తి. "
- రాజీవ్ బైరాన్,ఇండో-ఇజ్రయిల్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు
ఇతర దేశాల్లోనూ పరస్పరం వ్యాపార అవకాశాల లబ్ధి లక్ష్యంతో ఇండో-ఇజ్రాయిల్ అంతర్జాతీయ సమాఖ్యను మెుదటిసారిగా దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దేశాల మధ్య త్రైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందడానికి ఇది మార్గదర్శకం అవుతుందని రాజీవ్ తెలిపారు.
టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం (టీఏయూ) టెక్నాలజీ ఇన్నోవేషన్ మొమెంటం ఫండ్‌లో టాటా గ్రూప్ మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఆటోమెుటివ్, వైద్యరంగం వంటి తదితర రంగాల అంకుర సంస్థలకు నిలయమైన ఆ ప్రాంతాల్లో లైసెన్స్ కోసం చర్చించే అధికారం ప్రధాన పెట్టుబడిదారుగా టాటా గ్రూప్‌కే ఉంది.
ఇదీ చూడండి: బహిరంగంగా కరోనా టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు