కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు వాటిని సరిగా అర్థం చేసుకోలేదని నీతి ఆయోగ్(వ్యవసాయ) సభ్యుడు రమేశ్ చంద్ వ్యాఖ్యానించారు. కొత్త చట్టాలకు రైతుల ఆదాయాన్ని పెంచే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టాల ఉద్దేశం.. నిరసన చేస్తున్న రైతులు అర్థం చేసుకున్నదానికి పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు రమేశ్.
"రైతులు చేస్తున్న నిరసనల గురించి చదివాను. ఇవి చూస్తుంటే రైతులు వీటిని సరిగా అర్థం చేసుకోనట్టు కనిపిస్తోంది. వీటిని అమలు చేసేందుకు అనుమతిస్తే.. చాలా రాష్ట్రాల్లో రైతుల ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదాయం రెట్టింపు కూడా కావచ్చు."
-రమేశ్ చంద్, నీతి ఆయోగ్ సభ్యుడు
దేశంలో ఎక్కడా కార్పొరేట్ వ్యవసాయానికి అనుమతి లేదని రమేశ్ చంద్ స్పష్టం చేశారు. అయితే ఒప్పంద వ్యవసాయం మాత్రం చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే జరుగుతోందని తెలిపారు. ఏ ఒక్క ప్రాంతంలోనూ ప్రైవేటు కంపెనీలు రైతుల భూభాగాన్ని లాక్కున్న ఘటనలు లేవని చెప్పారు.
వృద్ధి గురించి...
మరోవైపు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి 3.5 శాతం కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. 2019-20లో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 3.7 శాతంగా నమోదైందని చెప్పారు.
ఎగుమతుల నిషేధంపై వివరణ
ఉల్లి ఎగుమతులపై తరచూ నిషేధం విధించడంపై వివరణ ఇచ్చారు రమేష్. ధరలు పెరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయని, ఇది భారత్తో పాటు అమెరికా, యూకే దేశాల్లోనూ జరుగుతుందని స్పష్టం చేశారు. కొన్నిసార్లు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దిగుమతులపై నిషేధం విధిస్తారని, అదే విధంగా వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా ఎగుమతులపై నిషేధం విధిస్తారని వివరించారు.
"ఉల్లి ధరలను రూ.100 కంటే ఎక్కువగా ఉండటానికి అనుమతించం. ఎగుమతులపై నిషేధం విధిస్తే ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఏదో చేస్తుందని కాదు. ప్రత్యేకమైన సందర్భాల్లోనే నిషేధం విధించడం జరుగుతుంది. సాధారణ సమయాల్లో కాదు."
-రమేశ్ చంద్, నీతి ఆయోగ్ సభ్యుడు
ఇదీ చదవండి- కరోనా పుట్టింది భారత్లోనే: చైనా