కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశమంతా లాక్డౌన్ అమలవుతోంది. పరిశ్రమలు మూతపడ్డాయి. సేవలు నిలిచిపోయాయి. ఈ ఆంక్షలు ఎత్తేసిన తర్వాత కొన్ని రంగాలు కోలుకునేందుకు చాలా కాలం పడుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. కొన్ని రంగాలు మాత్రం వెంటనే ఊపందుకుంటాయని చెబుతున్నారు.
కరోనా కాలంలో..
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఫార్మా, వైద్య, ఆరోగ్య పరికరాల పరిశ్రమలు, డిజిటల్ సంస్థలు దూసుకెళుతున్నాయి. లాక్డౌన్ సమయంలో వినోద కార్యక్రమాలు, సరఫరా వ్యవస్థలు కలిగిన డిజిటల్ సంస్థలు భారీగా లాభాలు అర్జిస్తున్నాయని టెలికాం, ఐటీ శాఖ మాజీ కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రజల ప్రవర్తనపై..
లాక్డౌన్ తర్వాత డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వెంటనే కోలుకుంటాయని ఆయన అన్నారు. రవాణా, నిల్వ, గిడ్డంగి వంటి రంగాలు త్వరగా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. అయితే యాత్రలు, హోటళ్లు, విదేశీ ప్రయాణాలు, షాపింగ్ మాళ్లు తదితర రంగాలు పుంజుకోవడం ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.
" ఈ పరిస్థితుల్లో ప్రజలు రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు. ఈ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది."
- ఆర్ చంద్రశేఖర్, టెలికాం, ఐటీ శాఖ మాజీ కార్యదర్శి
ఈ-కామర్స్కు అవకాశం..
లాక్డౌన్ తర్వాత ఈ-కామర్స్, రిటైల్ సంస్థలు నిర్వహించే హోం డెలివరీ సేవలకు ఆదరణ పెరుగుతుందని ఓ కార్పొరేటు సంస్థ అధికారి అభిప్రాయపడ్డారు.
" కరోనా ప్రభావంతో ప్రజలు అనవసర ప్రయాణాలు, హోటళ్లలో బస చేసేందుకు ఇష్టపడరు. అందులో ఎవరు ఉన్నారనే భయం అందరిలో ఉంటుంది. ఫలితంగా ఈ రంగాలు కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. వాటి కార్యకలాపాలు కూడా ఒక్కసారిగా తగ్గుతాయి."
- కార్పొరేటు సంస్థలో సీనియర్ అధికారి
వైద్య రంగంపై దృష్టి..
లాక్డౌన్ తర్వాత దేశంలోని ఆరోగ్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు భారీగా పెంచాలని అసోచామ్ ప్రధాన కార్యదర్శి దీపక్ సూద్ అభిప్రాయపడ్డారు. ఇందుకు చాలా వనరులు అవసరమని ఆయన అన్నారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమపై ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ సమయంలో తరిగిపోయిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రేడియంట్స్ (ఏపీఐ) నిల్వలను పూరించి స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది."
- దీపక్ సూద్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపుపై రేపు మోదీ ప్రకటన!