Indian Rupee: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆర్థిక సమీకరణలకు తావిస్తోంది. అందులో భాగమే రూపాయి అంతర్జాతీయీకరణ ప్రతిపాదన. మనదేశ కరెన్సీని అంతర్జాతీయ వాణిజ్యంలో చెల్లింపులు- పరిష్కారాలకు వినియోగించే అవకాశం ఆసన్నమైందని, రూపాయిని రిజర్వు కరెన్సీగా విశ్వవ్యాప్తం చేసే ఆలోచన చేయాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక నివేదికలో పేర్కొంది. "ప్రపంచ వాణిజ్యంపై అమెరికా డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగొచ్చు. కానీ రష్యాపై పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు పెద్దఎత్తున విధిస్తున్న నేపథ్యంలో, కొన్ని దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి. రూపాయి- రూబుల్ (రష్యా కరెన్సీ) వాణిజ్యానికి జరుగుతున్న సంప్రదింపులు ఈ కోవలోనివే. బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా మరికొందరు ప్రతి పాదిస్తున్నారు" అని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారుడు సౌమ్య కాంతి ఘోష్ వివరించారు. 'రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించటానికి తగిన సందర్భం రావాలి. అది ఇప్పుడు కనిపిస్తోంది' అన్నారాయన.
చెల్లింపులు చేయలేకపోతున్న రష్యా
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల 'స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్' ను వినియోగించుకుని అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు చేయలేని పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోంది. రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి అలెగ్జాండర్ నొవాక్ గత వారంలో భారత ప్రభుత్వ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో మాట్లాడుతూ, మనదేశానికి ముడిచమురును అధికంగా సరఫరా చేస్తామని ప్రతిపాదించారు. రష్యా చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయనీ తెలిపారు. ఇటువంటి కాంట్రాక్టులకు డాలర్లలో కాకుండా రూపాయి- రూబుల్ పద్ధతిలో చెల్లింపులు చేసే ప్రతిపాదన ఇరుపక్షాల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు ఏఏ వస్తువులు ఎగుమతి చేసే అవకాశం ఉందనే అంశంపై మనదేశం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, విద్యుత్తు రంగ ఉత్పత్తులు ఉంటాయని సమాచారం.
ఇబ్బందులూ ఉంటాయ్
రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ముఖ్యంగా ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టంగా మారుతుందని ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గతంలో అభిప్రాయపడింది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని తాజాగా ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ఫలితంగా రూపాయి మారకపు విలువ మరీ పతనం కాకుండా ఆర్‌బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి మద్దతుగా నిలిచే చర్యలపై దృష్టి సారించింది. తద్వారా ద్రవ్యోల్బణ హెచ్చుతగ్గులు మరీ ఎక్కువగా లేకుండా చూసే అవకాశం కలుగుతోంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ గత కొంతకాలంగా రూ.74 వద్ధ స్థిరంగా ఉండగా, ఇటీవల రూ.77 వరకూ విలువ క్షీణించింది. తాజాగా రూ.76- 77 మధ్య కనిపిస్తోంది.
- రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల రూపాయి మరీ ఎక్కువగా బలహీన పడదని ఎస్‌బీఐ అభిప్రాయ పడింది. డాలర్ విలువ రూ.76-78 మధ్య కదలాడొచ్చని పేర్కొంది.
ఇదీ చూడండి : పెట్రోల్ ధరలకు కళ్లెం? రష్యా 'డిస్కౌంట్' చమురుతో కేంద్రం స్కెచ్!