టెలికాం రంగంలో టారిఫ్‌ల పెంపు అనివార్యమని ఈవై అంచనా వేసింది. ప్రస్తుత విధానంతో ఆపరేటర్లకు సరిపడా లాభాలు రావడం లేదని, కొవిడ్-19తో మారిన ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్‌ల పెంపు ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోవచ్చని, అయితే వచ్చే 12-18 నెలల్లో రెండు సార్లు టారిఫ్‌ల పెంపు ఉండొచ్చని ఈవై ఎమర్జింగ్ మార్కెట్స్ టెక్నాలజీ లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. 'టారిఫ్‌ల పెంపు తప్పనిసరి. వచ్చే ఆరు నెలల్లో పెంపు ఉండొచ్చు. ఎంత తొందరగా పెంచితే టెలికాం రంగానికి అంత మంచిది. మార్కెట్‌లో కంపెనీ నిలబడాలంటే టారిఫ్‌ల పెంపు అనివార్యం' అని సింఘాల్ పేర్కొన్నారు.
నియంత్రణ సంస్థ జోక్యం లేదా పరిశ్రమ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందేనని, కానీ ఆపరేటర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ రంగం మెరుగ్గా రాణించాలంటే.. కంపెనీలు అందిస్తున్న సేవలకు అనుగుణంగా ధరలు ఉండాలని వెల్లడించారు. 'డిసెంబరులో ఒకసారి పెంపు ఉండాలి. ఇతర వర్థమాన దేశాలతో సమానంగా ధరలు చేరాలంటే ఒకటి లేదా రెండుసార్లు టారిఫ్‌లు పెంచాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు భారం కాకుండా కూడా చూడాలి. అప్పుడే ఈ రంగం పునరుజ్జీవం సాధ్యపడుతుంది' అని సింఘాల్ అన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) 60-80 శాతం పెరగొచ్చని భావిస్తున్నారని, అయితే ఇది టారిఫ్‌ల పెంపు, ఫిక్స్‌డ్ ప్లాన్ల నుంచి డేటా వినియోగం ఆధారిత ప్లాన్‌లకు మారితేనే సాధ్యమని చెప్పారు.
ఇదీ చూడండి:- ఆదాయపు పన్ను 'టీడీఎస్' ఫారమ్‌లో మార్పులు