అంకురాల అభివృద్ధి కోసం, వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలకు తోడ్పాటు కోసం.. రూ.వెయ్యి కోట్లతో 'స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్'ను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో యువ జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా అంకుర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అంకుర సంస్థల స్థాపన విషయంలో.. ఇంతకు ముందు, ఇప్పటికి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని ప్రధాని తెలిపారు. గతంలో 'ఎందుకు ఉద్యోగం చేయకూడదు?' అనే ధోరణి ఉండేదని.. దాని స్థానంలో 'ఎందుకు అంకుర సంస్థను స్థాపించకూడదు?' అనే వైఖరి ప్రజల్లో అలవడిందని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్-'ప్రారంభ్'లో పాల్గొన్న ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్లున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. నూతనంగా స్థాపించే 40 శాతం పారిశ్రామికవేత్తలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్నారు. ఇక్కడ 41వేలకుపైగా అంకుర సంస్థలున్నాయి. వాటిలో అత్యధికంగా ఐటీ రంగంలో 5700, ఆరోగ్య రంగంలో 3600, వ్యవసాయ రంగంలో 1700 సంస్థలు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు ప్రజల ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. 'మేము చేయగలం' అని నేడు దేశం చెప్తోంది. డిజిటల్ చెల్లింపులు, సౌర విద్యుత్ వంటి పలు వ్యవస్థల్లో వచ్చిన మార్పులను అందుకు ఉదాహరణలుగా చూపుతోంది.
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
2014లో యునికార్న్ క్లబ్‌లో కేవలం నాలుగు స్టార్టప్‌లు మాత్రమే ఉండేవని.. నేడు వాటి సంఖ్య 30కి పైగా పెరిగిందని మోదీ తెలిపారు. ఒక్క 2020లోనే 11 అంకురాలు ఈ క్లబ్‌లోకి ప్రవేశించాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'రాహుల్జీ.. మన శాస్త్రవేత్తలను ప్రశంసించరా?'