PM Modi On Startups: నవ భారత్‌కు వెన్నెముకగా అంకుర సంస్థలు ఉంటాయని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. భారత్‌లో, భారత్ కోసం సరికొత్త ఆవిష్కరణలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశంలో 60వేలకు పైగా స్టార్ట్అప్ సంస్థలు, 42 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయన్నారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు సృజన, సాంకేతికతపరమైన పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇన్నోవేషన్, వ్యవస్థాపకత, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్.. లాంటి మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు మోదీ.
"గతేడాది 28వేల పేటెంట్స్ మంజూరు చేశాం. 2013-14లో 4వేల పేటెంట్స్ మాత్రమే మంజూరు అయ్యాయి. 2013-14లో 70వేల ట్రేడ్ మార్కులు రిజిస్ట్రేషన్ కాగా.. 2020-21లో 2.5లక్షల ట్రేడ్‌మార్క్‌లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతేగాక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ 46వ స్థానంలో కొనసాగుతోంది. 2015లో 81 స్థానంలో ఉంది."
-- ప్రధాని నరేంద్ర మోదీ
అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కావడం లేదని.. వాటివల్ల ఉద్యోగ కల్పన కూడా జరుగుతోందన్నారు ప్రధాని మోదీ.
అంకుర సంస్థల ప్రాముఖ్యాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ఏటా జనవరి 16న నేషనల్ స్టార్ట్అప్ డేను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు మోదీ.
ఇదీ చూడండి: ఘనంగా సైనిక దినోత్సవం- అమరులకు త్రివిధ దళాల సలాం