ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాలకు సంబంధించి నూతన నిబంధనలు రూపొందించింది. ఇవి జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించే బాధ్యత ఇప్పుడు ఉద్యోగి యజమానిపై ఉండనుంది. ఒకవేళ వారు ఆధార్ అనుసంధానం చేయకపోతే ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే యజమాని వాటా నిలిచిపోతుంది. కాబట్టి పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి.
కొత్త నిబంధన ఏంటి?
సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ఆధారంగా ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 తర్వాత ఆధార్‌తో పీఎఫ్ లింక్ కాని ఖాతాలకు ఈసీఆర్(ఎలక్ట్రానిక్ ఛలాన్ కమ్ రిటర్న్) నిలిచిపోతుందని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతాదారులకు యజమాని నుంచి వచ్చే వాటా కూడా నిలిచిపోతుంది.
నోటిఫికేషన్
ఆధార్ అనుసంధానం చేయకపోతే ఈసీఆర్ ఫైల్ చేసే అవకాశం లేదని ఈపీఎఫ్ఓ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆధార్ అనుసంధానం చేయకపోతే.. ఈపీఎఫ్ఓ సేవలను వినియోగించుకునే అవకాశం కూడా ఉండదని తెలిపింది. దీనిపై అన్ని ఉద్యోగ సంస్థల యజమానులకు సమాచారం పంపించింది. కాబట్టి పీఎఫ్‌ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం తక్షణావసరం.
ఎలా చేసుకోవాలంటే...
- ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌ను సందర్శించి... అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్‌లోని ఈ-కేవైసీ పోర్టల్ ఓపెన్ చేసి- లింక్ యూఏఎన్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.
- యూఏఎన్ నెంబర్, యూఏఎన్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌ను అప్లోడ్ చేయాలి.
- అనంతరం మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్‌ను ఓటీపీ బాక్స్‌లో నమోదు చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి. చివరగా ప్రపోస్డ్ ఓటీపీ వెరిఫికేషన్‌పై క్లిక్ చేయాలి.
- ఆధార్ వివరాలను ధ్రువీకరించేందుకు ఆధార్ అనుసంధానిత మొబైల్ లేదా మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానమవుతుంది.
ఇదీ చదవండి- petrol price: మే నెలలో 16వ సారి పెట్రో బాదుడు