పబ్లిక్ ఇష్యూలతో పాటు ఎన్‌ఎస్‌ఈ-200 కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే నిమిత్తం పెన్షన్ ఫండ్ మేనేజర్లకు (పీఎఫ్‌ఎమ్) త్వరలోనే అనుమతులు రావొచ్చు. చందాదార్ల సంఖ్యను పెంచుకునే నిమిత్తం పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఈ దిశగా ఆలోచన చేస్తోంది. కొవిడ్-19 పరిణామాల నేపథ్యంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై ఆసక్తి పెరగడమూ ఇందుకు కారణమని పీఎఫ్‌ఆర్‌డీఐ ఛైర్మన్ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ్ అన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో రూ.5,000 కోట్లకు మించి మార్కెట్ విలువ కలిగి ఉన్న షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్‌ఎమ్‌లకు అనుమతి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో మంచి ప్రతిఫలాలను పొందేందుకు ఉన్న అవకాశాలను ఈ ఆంక్షలు పరిమితం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణగా అవెన్యూ సూపర్ మార్కెట్స్ షేరును చెబుతున్నారు. మంచి లాభాలు ఆర్జిస్తున్న ఈ షేరు, ఎఫ్ అండ్ ఓలో లేనందున, పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు.
'ఈక్విటీల్లో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టే విషయమై 2-3 రోజుల్లో కొత్త నిబంధనలను నోటిఫై చేయనున్నామ'ని బంద్యోపాధ్యాయ్ అన్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ఇష్యూలు, మలివిడత పబ్లిక్ ఆఫర్, ఆఫర్ ఫర్ సేల్‌లో పీఎఫ్‌ఎమ్‌లు పెట్టుబడులు పెట్టే వీలు కలుగుతుంది. అలాగే షేర్ల ఎంపిక పరిధి కూడా పెరుగుతుంది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో అత్యుత్తమ 200 కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టవచ్చని బంద్యోపాధ్యాయ్ వెల్లడించారు. ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి నష్ట భయాన్ని నివారించేందుకు కొన్ని ప్రత్యేక సూచనలు కూడా ఉంటాయని తెలిపారు.
కోటి మంది చందాదార్లే లక్ష్యం
చందాదార్ల సంఖ్యను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఒక కోటికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని బంద్యోపాధ్యాయ్ అన్నారు. ఇందులో 90 లక్షల మంది అటల్ పెన్షన్ యోజన నుంచి మిగిలిన 10 లక్షల మంది ఇతర పింఛన్ పథకాల నుంచి ఉంటారని తెలిపారు. కొవిడ్-19 పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఏప్రిల్-జూన్‌లో 1.6 లక్షల మంది చందాదార్లు జత అయ్యారని వివరించారు. 10 ఏళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న డెట్ సెక్యూరిటీస్‌లోనే పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్‌ఎమ్‌లు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టులు, మౌలిక పెట్టుబడుల ట్రస్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పీఎఫ్‌ఎమ్‌లను అనుమతినిచ్చే అవకాశం ఉందని బంద్యోపాధ్యాయ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనా ప్రభావంతో రిటైల్ రుణాల్లో అనూహ్య వృద్ధి!
ఇదీ చూడండి: ఉద్యోగులకు డీఏ పెంపుపై కేంద్రం కీలక ఆదేశాలు