ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్టులో భారీగా క్షీణించాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఎఫ్ఏడీఏ వెల్లడించింది. గతేడాది ఆగస్టు అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 7.12 శాతం తగ్గి 1.78 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయని తెలిపింది.
ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అన్ని రకాల వాహనాల అమ్మకాల్లో 26.81 శాతం క్షీణత నమోదైందని నివేదించింది. 2019 ఆగస్టులో 16.23 లక్షల వాహనాలు అమ్ముడుపోగా.. ప్రస్తుతం 11.08 లక్షలకు పడిపోయాయని తెలిపింది.
వాహనాలు | క్షీణత | 2020 ఆగస్టు (యూనిట్లు) | 2019 ఆగస్టు (యూనిట్లు) |
టూవీలర్ | 28.71% | 8.98 లక్షలు | 12.60 లక్షలు |
కమర్షియల్ | 57.39% | 26,536 | 62,270 |
త్రీ వీలర్ | 69.51% | 55,293 | 16,857 |
జీఎస్టీ తగ్గించాలి..
అయితే, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భారీగా పడిపోయిన వాహన అమ్మకాలు.. ఆగస్టులో పుంజుకున్నట్లు ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటి తెలిపారు.
"పండగ సీజన్ ప్రారంభం కావటం, అన్లాక్ ప్రక్రియ కొనసాగుతుండటం వల్ల ఆగస్టులో అమ్మకాలు పుంజుకున్నాయి. అమ్మకాలకు ఊతమిచ్చేందుకు టూవీలర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్క్రాపింగ్ విధానంలో మార్పులు చేయాలి."
- వింకేశ్ గులాటి
పరిస్థితుల్లో మార్పు వస్తోన్నా.. కరోనా పూర్వ స్థితికి వాహన రంగం ఇంకా చేరుకోలేదని గులాటి అన్నారు. కమర్షియల్ వాహనాలకు ఫైనాన్స్ విషయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: 2021లో భారత వృద్ధి రేటు -10.5%: ఫిచ్