ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం ఎవరూ ఊహించలేని రీతిలో ఉంటుందని హెచ్చరించారు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అధ్యక్షుడు రాబెర్టో అజెవెడో. మన జీవితంలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు ప్రజలను కాపాడేందుకు గతంలో కనీవినీ ఎరుగని విధంగా చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వైరస్ కారణంగా వాణిజ్య రంగంలో తీవ్ర నష్టాలు తప్పవని, భవిష్యత్ పరిణామాలు బాధాకరంగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు రాబెర్టో.
ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మూడోవంతు కుప్పకూలుతుందని డబ్యూటీఓ తెలిపింది. 2019లోనే వాణిజ్య రంగంలో క్షీణత నమోదైందని, ఈ ఏడాది అది మరింత తీవ్రమవుతుందని పేర్కొంది. 13 నుంచి 32 శాతం నష్టపోయే అవకాశం ఉంటుందని వివరించింది.
కరోనా సంక్షోభానికి ముందే వాణిజ్య ఉద్రిక్తతలు, అనిశ్చితి, ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచ వాణిజ్యం 0.1శాతం క్షీణించింది. అంతకు ముందు సంవత్సరం 2.9 శాతం వృద్ధి సాధించింది.