సమాజంలోని అసమానతలు, అన్యాయాలను వెలుగులోకి తెచ్చే భూతద్దంలా కరోనా మహమ్మారి మారిందని విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ పేర్కొన్నారు. కోట్ల మంది పౌరులకు కనీస గౌరవం లభించకపోవటాన్ని తేటతెల్లం చేస్తూ.. ప్రజా వ్యవస్థలు చేయాల్సిన పనులను గుర్తు చేసిందని ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన వివరించారు. 'ఆర్థిక వ్యవస్థ అనేది సమాజంలో ఒక భాగమని గుర్తు చేసింది. మనుషులంతా అన్ని కోణాల్లో సమానంగా బాగుండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
సమాజంలో మార్కెట్లు, వ్యాపారాలు అనేవి భర్తీచేయలేని పాత్ర పోషిస్తున్నాయనీ తేటతెల్లం చేసింద'ని వివరించారు. ఆహారం, నివాసం, భద్రత, ప్రాథమిక సామాజిక భద్రత, సమాన, అత్యున్నత నాణ్యత గల విద్య, ప్రజారోగ్య వ్యవస్థలు, భూ సంరక్షణ, అన్ని జీవరాసుల రక్షణ, అసమానత్వ తొలగింపు వంటివి మన అజెండాగా ఉండాలని తెలిపారు. ఇందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, పౌర సమాజం, రాజకీయనేతలు, సగటు పౌరులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.అపుడే సమాన, మానవత్వం ఉన్న స్థిరమైన సమాజాన్ని మనం పొందగలమని ప్రేమ్జీ చెప్పారు.
ఇదీ చదవండి : గణతంత్ర దినోత్సవ పరేడ్లో అటల్ టన్నెల్