ఎలక్ట్రిక్ వాహనాలకు(Electric Vehicles) దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చు కూడా తక్కువ కావడం వల్ల ప్రజలు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వాహనాలకు ఛార్జ్ చేసేందుకు ఛార్జింగ్ స్టేషన్లు(EV Charging Stations) ఎక్కువగా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కర్ణాటక బెెంగళూరులోని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) యాజమానికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో అతను స్కూటర్‌ను లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోని తన ప్లాట్‌కు తీసుకెళ్లాడు. కిచెన్ గదిలో ఛార్జింగ్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను లింక్డిన్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ స్కూటర్ యజమాని పేరు విశ్ గంటి. బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట హలిమావులోని అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం నాలుగు నెలలు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోవడం వల్ల ఇలా చేసి నిరసన వ్యక్తం చేశాడు.
" దేశీ జుగాడ్ గురించి మీరు విని ఉంటారు. ఈరోజు నేను చేసింది అలాంటిదే. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల రాజధాని అయిన బెంగళూరులోని అపార్ట్మెంట్లో ఛార్జింగ్ స్టేషన్‌కు అనుమతి ఇవ్వలేదు. వారికి అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది." అని లింక్డిన్లో పోస్టు చేశాడు.
తాను చేసినట్టుగా కిచెన్‌లో స్కూటర్ ఛార్జ్ చేసేందుకు మరెవరూ ప్రయత్నించవద్దని విశ్ చెప్పాడు. దాని వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించాడు.
అతనొక్కడే...
అయితే అపార్ట్మెంట్ యాజమాన్యం మాత్రం విశ్ వాదనను తోసిపుచ్చింది. మొత్తం 300 మంది ఉన్న ఈ భవనంలో ముగ్గురికి మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని తెలిపింది. అందులో ఇద్దరికి బ్యాటరీని తీసి, ఫ్లాట్‌కు పట్టుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉందని చెప్పింది. ఇతనొక్కడి కోసం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం కష్టమని, అతనికి పార్కింగ్ సదుపాయం కూడా లేదని వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, ముందుగా దాని కోసం స్థలాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కష్టమవుతోందని ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ హవానాలపై మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిని కొనుగోలు చేసే వారికి రాయితీలు(Electric Vehicle subsidy) కూడా ప్రకటిస్తోంది.
ఇదీ చదవండి: ఐదేళ్లలో ఆరు విదేశీ సంస్థలు గుడ్‌బై- ఎందుకిలా?