భారతీయ స్టేట్ బ్యాంకు ఓటీపీ ఆధారిత డెబిట్‌కార్డు లావాదేవీలను రోజంతా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. శుక్రవారం నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయని ఎస్‌బీఐ యాజమాన్యం వెల్లడించింది. డెబిట్ కార్డుదారులు పదివేలకు మించి ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకోవాలంటే ఇకపై వన్‌టైంపాస్‌వర్డ్- ఓటీపీ తప్పనిసరి చేసింది.
రోజంతా..
ఈ ఏడాది జనవరిలోనే ఈ సదుపాయాన్ని ప్రవేశ పెట్టినప్పటికీ... ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు 24 గంటలు రోజంతా... ఎప్పుడైనా పదివేలకు మించి నగదు ఉపసంహరించుకోడానికి అవకాశం కల్పించిన బ్యాంకు యాజమాన్యం ఓటీపీ తప్పనిసరి చేసింది.
ఓటీపీ తప్పనిసరి..
కార్డులను స్కిమ్మింగ్ చేయడంకాని, క్లోనింగ్ చేయడం ద్వారా కాని ఖాతాదారుడికి సంబంధం లేకుండా నకిలీ డెబిట్ కార్డులతో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరించుకునేందుకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. పదివేలకు మించి ఏటీఎంల నుంచి డెబిట్ కార్డు ద్వారా విత్‌డ్రా చేయాలంటే ఇకపై కార్డుదారుడి రిజిస్టర్డు మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఏటీఎంలో నమోదు చేస్తేనే నగదు బయటకు వస్తుంది.
శుక్రవారం నుంచి మార్పులు..
శుక్రవారం నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. రోజుకు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారుడి డబ్బుకు భరోసా కల్పించే రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ బ్యాంకర్లు చెబుతున్నారు. ఇకపై పదివేలకు మించి నగదు ఉపసంహరణ కోసం ఏటీఎం వద్దకు వెళ్లే డెబిట్ కార్డుదారుడు రిజిస్ట్రర్ ఫోన్ నంబరు కలిగిన మొబైల్ వెంట ఉండడం అవసరమని ఎస్‌బీఐ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి ప్రకటన విడుదల చేశారు.