ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), రష్యా సహా ఇతర ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల మధ్య జరగాల్సిన ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన చమురు ఉత్పత్తి దేశల్లో ఒకటైన అజర్బైజాన్ ప్రతినిధి జమినా అలీయేవా తెలిపారు.
ఏప్రిల్ 9 వరకు ఈ భేటీ వాయిదా పడినట్లు సమాచారం. అయితే దీనిపై ఒపెక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ వారం చివరిలో జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.
కారణమేంటి!
ఈ సమావేశం మొదట వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సోమవారం జరగాల్సి ఉంది. చమురు విపణిని స్థిరీకరించడానికి ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాల మధ్య అత్యవసర భేటీకి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.
కరోనా కారణంగా...
మహమ్మారి కరోనావైరస్ కారణంగా దశాబ్ద కాలంలో ఎన్నడు లేని విధంగా చమురు ధరలు పతనమైపోయాయి. ఈ నేపథ్యంలో గత నెలలో రష్యా, ఒపెక్, దాని మిత్ర దేశాలు చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది.
ఉమ్మడి ప్రయత్నాలు...
రష్యా రోజుకు 10 మిలియన్ బారెల్స్ ఉత్పత్తి తగ్గించడంపై చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. "మార్కెట్‌ను సమతుల్యం చేయడానికి, ఉత్పత్తిని తగ్గించడానికి సమష్టి ప్రయత్నాలు అవసరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ ప్రజలు ఇంత ఆరోగ్యంగా తయారయ్యారా?