భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో స్పష్టంచేశారు. వాణిజ్య, ఆన్-బోర్డ్ సేవలు అందించేందుకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు గోయల్.
ప్రభుత్వం వల్ల కాదు కనుకే...
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన పలు ప్రశ్నలకు గోయల్ సమాధానమిచ్చారు. రాబోయే 12 సంవత్సరాలపాటు రైల్వే నిర్వహణకు రూ.50 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం భరించలేదని స్పష్టం చేశారు. అందుకే ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
"ప్రయాణికులకు మెరుగైన సేవలు, ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదు. భారతీయ రైల్వే ఎల్లప్పుడూ భారతదేశ ప్రజల ఆస్తిగా కొనసాగుతుంది."
- పీయూష్ గోయల్, రైల్వే మంత్రి
కార్పొరేటీకరణ మాత్రమే..
ప్రయాణికుల అవసరాల కోసం మరిన్ని కొత్త రైళ్లు, సౌకర్యాలు ఏర్పాటుచేయాల్సి ఉందని పీయూష్ తెలిపారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు రైల్వేల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుత వ్యవస్థలో భాగస్వాములుగా చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు.
"రైల్వేను ప్రభుత్వం కార్పొరేటీకరణ మాత్రమే చేస్తోంది. ప్రైవేటీకరించడంలేదు. ప్రభుత్వం వాణిజ్యపరంగా అవుట్సోర్సింగ్ చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు బోర్డులో సేవలు అందిస్తాయి. వారికి లైసెన్సులు జారీ చేస్తాం. యాజమాన్యం మాత్రం భారతీయ రైల్వే వద్దే ఉంటుంది."
-పీయూష్ గోయల్, రైల్వే మంత్రి
మరిన్ని ఉద్యోగాలు..
ప్రస్తుత భారత రైల్వే ఉద్యోగులు అలానే కొనసాగుతారని పీయూష్ స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థల వల్ల మెరుగైన సేవలతో పాటు అదనపు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన తెలిపారు.
రైల్వే స్పందిస్తుంది!
ప్రైవేటు సంస్థలు అందించే ఆన్‌బోర్డు సేవల్లో తలెత్తే సమస్యలపై భారతీయ రైల్వే స్పందిస్తుందా? అన్న ప్రశ్నకు ఔనని జవాబిచ్చారు పీయూష్.
ఇదీ చూడండి: దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే?